టాలీవుడ్ సీనియర్ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ లు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసారు.
బాలయ్యకు అభినందనలు తెలియజేస్తూ ” హిందూపురం శాసన సభ్యులు, ప్రముఖ కథానాయకులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు ‘పద్మభూషణ్’ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో శ్రీ బాలకృష్ణ గారికి ప్రత్యేక స్థానం ఉంది. చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొంటుంది. ప్రజా సేవలో, కళా సేవలో శ్రీ బాలకృష్ణ గారు మరిన్ని మైలు రాళ్ళు చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని లేఖ విడుదల చేసారు.
అజిత్ కుమార్ కు అభినందనలు తెలుపుతూ “ప్రముఖ కథానాయకులు శ్రీ అజిత్ కుమార్ గారు పద్మభూషణ్ పురస్కారం స్వీకరించిన సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. కుటుంబ, ప్రేమ కథా చిత్రాలతో మెప్పిస్తూనే వైవిధ్యభరితమైన చిత్రాలు చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ మెప్పించారు. స్టయిల్ పరంగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఫార్ములా-2 రేసర్ గా ఆ రంగంలోనూ రాణిస్తున్నారు. నటుడిగా, రేసర్ గా శ్రీ అజిత్ గారు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని లేఖ విడుదల చేసారు.