గత కొన్నేళ్ళుగా సహజీవనం చేస్తున్న కోలీవుడ్ జంట నయనతార, విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు పెళ్ళి పీటలు ఎక్కబోతున్నారు. విచిత్రం ఏమంటే… ఇప్పటికే వారికి వివాహం జరిగినట్టుగా కొన్ని వందలసార్లు వార్తలు వచ్చాయి. కలిసి జీవితాన్ని గడుపుతున్న వీరు మాత్రం ఈ విషయమై పెదవి విప్పలేదు. ఇదిలా ఉంటే… తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ను శనివారం కలిసి తమ వివాహ శుభలేఖను వారు అందించారు. ఈ సందర్భంగానూ వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తెలిసిన సమాచారం మేరకు వీరి వివాహం చెన్నయ్ లో ఈ నెల 9న జరుగబోతోంది.
కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నయన్, విఘ్నేష్ శివన్ వివాహం చేసుకోబోతున్నారు. సినిమారంగానికి చెందిన అతి కొద్దిమంది మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. అందులో ఇటీవల విఘ్నేష్ శివన్ మూవీ ‘కె.ఆర్.కె.’లో నటించిన విజయ్ సేతుపతి, సమంత ఉంటారని అంటున్నారు. ఏదేమైనా… ఇప్పటికే వీరి వివాహం జరిగిందనే వార్తలకు ఫుల్ స్టాప్ పెడుతూ, ఈ జంట ఈ సమయంలో పెళ్ళిపీటలు ఎక్కడానికి కారణం ఏమై ఉంటుందా అనే ఊహాగానాలు కోలవుడ్ లో మొదలయ్యాయి.