మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తున్నాయి. ఆ చిత్రాల నిర్మాత ఒక్కరే కావడంతో ఒకేసారి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ను ఇచ్చేశారు. ఫహద్ ఫాజిల్ హీరోగా మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంథో జోసెఫ్ మాలిక్
చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రజలు ఆరాధించే నాయకుడు సులేమాన్ గా ఫహద్ నటిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు మహేశ్ నారాయణన్ చెప్పాడు. బిజూ మీనన్, నిమిషా సజయన్, జోజు జార్జ్, దిలేష్ పోతన్, వినయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటీమణి జలజ రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే… ఈ సినిమాతో పాటే ఆంథో జోసెఫ్ కోల్డ్ కేస్
మూవీని సైతం నిర్మిస్తున్నాడు. పృథ్వీరాజ్ ఏసీపీ సత్యజిత్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సైతం అయిపోయింది. గత యేడాదిలోనే కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుని దీనిని పూర్తి చేశారు. తాను నిర్మిస్తున్న ఈ రెండు సినిమాలను ఓటీటీలోనే విడుదల చేయబోతున్నానంటూ నిర్మాత జోసఫ్ కేరళ ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ ఫెడరేషన్ కు ఓ లేఖ రాశాడు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా లేవని, ఒకవేళ ఓపెన్ చేసినా పూర్తి ఆక్యుపెన్సీకి అనుమతి లభించదేమోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరీ ఆలస్యమైతే ఆర్థికంగా తాను నష్టపోతానని జోసెఫ్ చెబుతున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. అమేజాన్ ప్రైమ్ లో ఈ సినిమాలు స్ట్రీమింగ్ అయ్యే ఆస్కారం ఉంది.