నోటి దాకా వచ్చిన ముద్ద నోట్లోకి వెళ్లకపోవటం అంటే ఏంటో… పాపం నోరాకి తాజాగా తెలిసి వచ్చిందంటున్నారు… బాలీవుడ్ జనాలు! ఆమె నోటిదాకా వచ్చిన ఓ ముద్దొచ్చే క్యారెక్టర్ చివరి నిమిషంలో చేజారిపోయిందట! ఇంతకీ, విషయం ఏంటంటే…
టైగర్ ష్రాఫ్ టైటిల్ రోల్ లో దర్శకుడు వికాస్ బాల్ ‘గణ్ పత్’ అనే సినిమా రూపొందించబోతున్నాడు. రెండు భాగాలుగా ఈ భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పార్ట్ వన్ అండ్ టూ రెండిట్లోనూ కృతీ సనోన్ హీరోయిన్ గా కనిపిస్తుందట. అయితే, ‘గణ్ పత్’ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండాలట. కథలో భాగంగా ఆమె ఒక భాగంలో కనిపిస్తుంది కానీ మరో భాగంలో ఉండదు. ఆ క్యారెక్టర్ కి నోరా ఫతేహి ఎంపికైందని ప్రచారం జరిగింది. కానీ, మీడియాకి ఆ లీకులు అందటానికి నోరా పీఆర్ టీమే కారణమట! ఈ విషయం గ్రహించిన ‘గణ్ పత్’ మూవీ దర్శకనిర్మాతలు నోరా తరుఫున పని చేస్తోన్న పబ్లిక్ రిలేషన్స్ టీమ్ వారి అత్యుత్సాహంతో అప్ సెట్ అయ్యారట. సినిమాలో నోరా ఫతేహీని తీసుకోవాలన్న ఆలోచన పక్కన పెట్టేశారట!
టైగర్ ష్రాఫ్ ‘గణ్ పత్’ మూవీలో ఇప్పుడు కృతీతో పాటూ కనిపించే మరో హీరోయిన్ కోసం అన్వేషణ సాగుతోంది. ఆమె చెల్లెలు నూపుర్ సనోన్ పేరు వినిపిస్తోంది. టైగర్ హీరోగా రూపొందే సినిమాలో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కనువిందు చేసే ఛాన్స్ ఉందట. ఒకవేళ అలా వద్దనుకుంటే కొత్త అమ్మాయిని తెరకి పరిచయం చేసే ఆలోచన కూడా దర్శకుడు వికాస్ బాల్ చేస్తున్నాడు. చూడాలి మరి, ‘గణ్ పత్’ లో ఆఫర్ మిస్ అవ్వటంపై మిస్ నోరా ఎప్పటికి నోరు విప్పుతుందో!