Aadi Saikumar: కొంతమంది హీరోలు ఫిల్మ్ ఇండస్ట్రీకి నక్కతోక తొక్కి వచ్చారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆశించిన స్థాయి విజయాలను అందుకోకపోయినా… వారికి వరుసగా అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆ మధ్య నితిన్ గురించి అలా అనుకునే వారు… ఇప్పుడు ఆ కేటగిరిలోకి ఆది సాయికుమార్ కూడా చేరాడు. ఒకప్పటి హీరో కృష్ణ మాదిరి జయాపజయాలతో నిమిత్తం లేకుండా ఆది సాయికుమార్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కథల ఎంపిక విషయంలో రకరకాల ప్రయోగాలకూ సిద్ధపడుతున్నాడు. కొన్ని సినిమాలు ఏవరేజ్ గా నిలుస్తుంటే, మరికొన్ని చిత్రాలు అబౌ ఏవరేజ్ గా ఆడుతున్నాయి. అడపాదడపా పరాజయాలూ పలకరిస్తున్నాయి. అయినా ఆది సాయికుమార్ మాత్రం ముందుకే సాగుతున్నాడు.
ఈ యేడాది ఆది సాయికుమార్ ఫిల్మ్ కెరీర్ కు సంబంధించి ఓ విశేషం ఉంది. 2011లో ‘ప్రేమకావాలి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు. అయితే గడిచిన రెండు సంవత్సరాలలో కరోనా కారణంగా సినిమాల విడుదల సంఖ్య కాస్తంత తగ్గింది కానీ ఆది సాయికుమార్ మాత్రం ఖాళీగా లేడు. ఆ సమయంలో మొదలైన పలు చిత్రాలు ఈ యేడాది జనం ముందుకు వచ్చాయి. దాంతో ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. మరో సినిమా ‘టాప్ గేర్’ డిసెంబర్ 30న రాబోతోంది.
ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ఈ యేడాది ప్రారంభంలోనే అంటే జనవరి 7న ఆది సాయికుమార్ ‘అతిథి దేవో భవ’ విడుదలైంది. ఒక రకంగా కాస్తంత పేరున్న హీరోలలో ఈ యేడాది విడుదలైన మొదటి చిత్రం అతనిదే. అలానే ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ 30న విడుదల కాబోతున్న చివరి చిత్రం కూడా అతనిదే! సో… ‘అతిథిదేవో భవ’తో మొదలు పెట్టి, ‘బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెలో’ చిత్రాల మీదుగా ‘టాప్ గేర్’తో ఈ యేడాదికి ఆది సాయికుమార్ గుడ్ బై చెప్పబోతున్నాడు. ఇదిలా ఉంటే అతను నటించిన మరో సినిమా ‘సిఎస్ఐ సనాతన్’ కూడా విడుదలకు సిద్థంగా ఉంది. దీన్ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అదే జరిగితే… ఈ యేడాది ఆది సాయికుమార్ నటించిన చిత్రాలు ఏకంగా ఆరు విడుదల అయినట్టు అవుతుంది. మరి డిసెంబర్ లో రాబోయే ‘సిఎస్ఐ సనాతన్’, ‘టాప్ గేర్’ చిత్రాలు చక్కని విజయాన్ని సాధించి, ఆది సాయికుమార్ కు ఈ యేడాదికి సంబంధించి ఆనందకరమైన వీడ్కోలు పలుకుతాయేమో చూడాలి.