Nandita Swetha: శుక్రవారం సింగిల్ క్యారెక్టర్ మూవీ ‘హలో మీరా’ జనం ముందుకు వచ్చింది. ఇలానే తెలుగులో రూపుదిద్దుకున్న మరో సింగిల్ క్యారెక్టర్ మూవీ ‘రా.. రా… పెనిమిటి’ సైతం ఇదే నెల 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో సింగిల్ క్యారెక్టర్ ను ప్రముఖ కథానాయిక నందితా శ్వేత పోషించింది. సత్య వెంకట గెద్దాడ దర్శకత్వంలో ప్రమీల గెద్దాడ నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందించారు.
“కొత్తగా పెళ్లైన అమ్మాయి తన భర్త రాకకోసం ఎదురు చూస్తూ పడే విరహ వేదనే ఈ చిత్రం. ఆమె భర్త వచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే” అంటున్నారు దర్శక నిర్మాతలు. గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ కాబట్టి గడుసుతనం ఉన్న అమ్మాయి కావాలని… అందుకోసం చాలా మందిని చూసి, చివరకు నందితా శ్వేతను ఎంపిక చేశామని, అష్ట లక్షణాలున్న నాయిక పాత్రను ఆమె చాలా అద్భుతంగా పోషించిందని దర్శకుడు సత్య వెంకట్ కితాబిచ్చారు. నీలకంఠ రాసిన పాటలు, రామ్ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. ఈ చిత్రంలో తెరపై కనిపించేది ఒక్క పాత్రే అయినా… వినిపించే పాత్రలకు బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సునీల్, సప్తగిరి, హేమ, అన్నపూర్ణమ్మ వాయిస్ అందించడం విశేషం.