కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో చిత్రపరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది. ఇక పునీత్ మృర్గిపట్ల పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిరంజీవి, వెంకటేశ్, బాలకృష్ణ, రామ్‌చరణ్.. ఇలా ఎంతోమంది తెలుగు సెలబ్రిటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇక తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పునీత్ కుటుంబాన్ని పరామర్శించారు. నేడు బెంగుళూరు వెళ్లిన బన్నీ.. ఎయిర్ పోర్ట్ నుంచి సరాసరి పునీత్ ఇంటికి వెళ్లారు. పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం పునీత్ సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ మాట నిలబెట్టుకున్నాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. పుష్ప ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లిన బన్నీ.. పునీత్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళలేదు. ఎందుకు అని అడిగితే.. నేను నా పని మీద వచ్చాను.. ఈ సమయంలో వారిని కలవడం నా మనసుకు నచ్చడం లేదు. వారికోసమే ప్రత్యేకంగా ఒకరోజు వస్తాను అని చెప్పాడు. చెప్పినట్లుగానే బన్నీ ఈరోజు పునీత్ కుటుంబాన్నీ పరామర్శించి, ఆయనకు ఘననివాళులు అర్పించారు.