స్తాద్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించిన ‘ది వారియర్’ చిత్రం గురువారం జనం ముందుకు వచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ‘గురు’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. అల్లు అర్జున్ ‘సరైనోడు’లో వైరం ధనుష్ అనే స్టైలిష్ విలన్ గా నటించిన ఆది, ‘ది వారియర్’లో పూర్తి కాంట్రాస్ట్ ఉన్న మాస్ విలన్ ‘గురు’ గా ఇందులో నటించాడు. ఈ సినిమా గురించి, అందులో తన పాత్ర గురించి ఆది శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సరైనోడు’ తర్వాత విలన్‌గా చేద్దామనప్పుడు ‘అజ్ఞాతవాసి’ చేశా. అది పవన్ కల్యాణ్ గారి సినిమా. దాని తర్వాత ఏ క్యారెక్టర్ వచ్చినా…. దాని కంటే బెటర్‌గా ఉండాలని ఆలోచించా. ‘ది వారియర్’లో రోల్ విన్నప్పుడు… ఆర్డనరీ విలన్‌గా కాకుండా, గురుకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అది నాకు నచ్చింది. అందుకని, చేశా. అయితే కథ విన్నప్పుడు నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. రెండు రోజులు లింగుస్వామి గారితో మాట్లాడి చిన్న చిన్న సందేహాలు క్లియర్ చేసుకుని వెంటనే ఒప్పుకున్నాను. గురు పాత్రకు ఫ్లాష్‌బ్యాక్ ఉండటంతో ప్రేక్షకుల అంత మాట్లాడుతున్నారని అనిపిస్తోంది’ అని అన్నారు.
హీరో, విలన్ అనే తేడాను తను చూడనని ఆది చెబుతూ.. ‘రెండూ కంఫర్ట్ గా అనిపిస్తాయి. ఆ క్యారెక్టర్స్ ను జనాలు నమ్మేలా వాళ్ళలోకి తీసుకువెళ్ళడం నిజమైన ఛాలెంజ్. హీరోగా చేస్తున్నానా? నాది నెగిటివ్ క్యారెక్టరా? అనే డిఫరెన్స్ నాకు లేదు. ఇక ‘ది వారియర్’లోని గురు పాత్ర విషయానికి వస్తే… క్లైమాక్స్ ఫైట్ సాంగ్ షూటింగ్ లా జరిగింది. ఆ ఫైట్‌లో రామ్, నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. మేమిద్దరం ఫైట్ చేస్తుంటే సాంగ్ లో డ్యాన్స్ చేస్తున్నట్టు ఉందని డైరెక్టర్ గారు ఒక రోజు చెప్పారు. ఇద్దరూ సింక్ లో ఉన్నప్పుడు అలా కుదురుతుంది. రామ్ గ్రేట్ పెర్ఫార్మర్. గ్రేట్ డ్యాన్సర్. డ్యాన్సర్‌కు ఫైట్‌లో సింక్ కుదురుతుంది. నేను అంత గ్రేట్ డ్యాన్సర్ కాకపోయినా మాకు సింక్ కుదిరింది. మేం కష్టపడి ఏమీ చేయలేదు. ఈ క్రెడిట్ అన్బు అరివు మాస్టర్లదే’ అని అన్నారు.
తెలుగు, తమిళ చిత్రాలలో నటించడం గురించి ఆది పినిశెట్టి చెబుతూ, ”తమిళ వాళ్ళు నేను తెలుగు వాడిని అనుకుంటున్నారు. తెలుగు వాళ్ళు తమిళోడిని అనుకుంటున్నారు. అది పక్కన పెడితే… ఇప్పుడు ప్రేక్షకులు భాషను పట్టించుకోవడం మానేశారు. మంచి కథ, సినిమా, పెర్ఫార్మన్స్ వస్తే ఆదరిస్తున్నారు. మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. భాషతో సినిమాకు సంబంధం లేకుండా సినిమాను సెలబ్రేట్ చేస్తున్నారు” అని అన్నారు. ఇటీవలే ఆది తన తోటి నటి నిక్లీ గర్లానిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ విషయం గురించి మాట్లాడుతూ, ”పెళ్ళైన తర్వాత నాకు పెద్ద మార్పు ఏమీ కనిపించడేలు. అదే సేమ్ లైఫ్. పెళ్ళికి ముందు ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’లా ఉండేవాళ్ళం ఏమో! పెళ్లి తర్వాత, ఇప్పుడు చాలా బావున్నాం. నాకూ, తనకూ మమ్మల్ని అర్థం చేసుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అంతా హ్యాపీగా ఉంది” అని అన్నారు. గురు పాత్ర గురించి తన తండ్రి రవిరాజా పినిశెట్టి కొన్ని సజెషన్స్ ఇచ్చారని, యాస కొంచెం బాగుంటే బాగుండేదన్నారని, కొన్ని సన్నివేశాలతో తన పెర్ఫార్మన్స్ బాగుందని, తన పాత్ర హైలైట్ అయ్యిందంటే అది రామ్ గొప్పదనమని ఆయన అన్నారని ఆది చెప్పాడు.