ప్రస్తుత జీవనశైలిలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా నేటి సమాజంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఊబకాయం. దీనిని నియంత్రించేందుకు చాలామంది జిమ్‌లకు వెళ్తున్నప్పటికీ, జిమ్ వ్యాయామాలకు అధిక ఖర్చు అవుతుంది. అంతేకాకుండా కఠినమైన ఆహార నియమాలు, క్లిష్టమైన వ్యాయామాలు పాటించాల్సి రావడం వల్ల కొందరికి అవి సాధ్యపడడం లేదు.
అయితే ఈ అన్ని సమస్యలకు ఒక సులభమైన, తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారం మన ఇంట్లో లేదా అపార్ట్‌మెంట్‌లోని మెట్లే. ప్రతి ఇంట్లో లేదా అపార్ట్‌మెంట్‌లో మెట్లు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ మెట్లు ఎక్కడం ఒక సాధారణమైన వ్యాయామంలా కనిపించినా, దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇకపై లిఫ్ట్‌ను ఉపయోగించకుండా మెట్లు ఎక్కడం అలవాటుగా మార్చుకుంటే శరీరం ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
మెట్లు ఎక్కడం వల్ల శరీరానికి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది శరీర బలాన్ని పెంచుతుంది, అదనపు కొవ్వును తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సాధారణ నడక లేదా జాగింగ్‌తో పోలిస్తే మెట్లు ఎక్కడం ఎక్కువ శక్తిని వినియోగించే వ్యాయామం. అందువల్ల తక్కువ సమయంలోనే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. అధిక బరువు, శరీరంలో పేరుకుపోయిన కొవ్వుతో బాధపడేవారికి ఇది ఒక సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామంగా వైద్యులు సూచిస్తున్నారు.
సుమారు ఆరు నిమిషాల పాటు నిరంతరంగా మెట్లు ఎక్కితే శరీరంలోని కొవ్వు శాతం తగ్గే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రోజుకు సుమారు 30 నిమిషాలు మెట్లు ఎక్కడం ద్వారా 250 నుంచి 300 కేలరీల వరకు కరిగే అవకాశం ఉంది. మెట్లు ఎక్కడం కార్డియో వ్యాయామం, బల శిక్షణ రెండింటి సమ్మేళనంలా పనిచేస్తుంది. నేటి బిజీ జీవనశైలిలో ప్రత్యేకంగా వ్యాయామానికి సమయం కేటాయించలేని వారు రోజువారీ కార్యకలాపాల్లో భాగంగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ సమాచారం అంతా ఇంటర్నెట్‌లో లభ్యమైన వనరుల ఆధారంగా సేకరించబడింది. మీకు ఏవైనా ఆరోగ్య సంబంధిత సందేహాలు ఉంటే నిపుణులైన వైద్యులను సంప్రదించడం ఉత్తమం.