Health Tips: చలికాలంలో ఉదయం పూట మంచు కురుస్తున్నా కొంతమంది వాకింగ్ చేస్తుంటారు. మంచు పడుతుండగా అప్పుడే వెచ్చని సూర్యకిరణాలు పడుతున్న సమయంలో వాకింగ్ చేయడాన్ని కొంతమంది ఇష్టపడుతుంటారు. అయితే చలిలో వాకింగ్ చేస్తే అనారోగ్యం బారిన పడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బెల్స్‌పాల్సీ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉందని సూచిస్తున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఇలాంటి కేసులు నమోదవుతుంటాయని.. అందుకే యువత, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు.
Read Also: Edible Oil Prices: సామాన్యులకు షాక్.. మళ్లీ పెరగనున్న వంటనూనెల ధరలు
చలిగాలులు చెవుల్లో నుంచి లోపలకు పోవడం వల్ల నాడులపై ప్రభావం పడి ముఖం ఒక పక్కకు లాగేసినట్లు ఏర్పడుతుందని.. మూతి కూడా వంకరపోతుందని.. దీనినే బెల్స్‌పాల్సీ అంటారని వైద్యులు వెల్లడించారు. 60 ఏళ్లు దాటిన వారికి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మెదడులో కణతులు, గవద బిళ్లలు, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా కూడా బెల్స్‌పాల్సీ సమస్య రావొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. చలికాలంలో వచ్చే ఈ కేసుల్లో ఎక్కువ శాతం చల్లని వాతావరణం కారణంగానే పెరుగుతుంటాయని.. ఈ వ్యాధిని వెంటనే గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే శాశ్వతంగా ఈ సమస్య వేధిస్తుందని చెప్పారు. అందువల్ల శీతాకాలంలో ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్యలో వాకింగ్ చేయకపోవడమే మంచిదని తెలిపారు. ఎండ వచ్చాక లేదంటే ముక్కు, చెవులు మూసుకునేలా మంకీ క్యాప్ ధరించి ఉదయం 8 గంటల తర్వాత వాకింగ్‌కు వెళ్లడమే ఉత్తమమని వైద్యులు సూచించారు.