గాజాలో హమాస్ చెరలో బందీలుగా ఉన్న అమెరికా పౌరుల కోసం వైట్‌హౌస్ రహస్యంగా చర్యలు జరిపినట్లు తెలుస్తోంది. అమెరికన్ బందీలను విడుదల చేయాలని హమాస్‌ను అమెరికా అధికారులు కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్‌కు సమాచారం ఇవ్వకుండానే.. ఈ చర్చలు జరిపినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: AP Assembly Sessions 2025: వాడివేడిగా కొనసాగుతున్న శాసనమండలి సమావేశాలు.. నేడు చర్చించే అంశాలు ఇవే!
1997లో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. అప్పటి నుంచి హమాస్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోలేదు. అయితే 2023, అక్టోబర్ 7న హమాస్.. ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా తీసుకెళ్లిపోయింది. అప్పటి నుంచి హమాస్ చెరలోనే బందీలు మగ్గుతున్నారు. ఇటీవల ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వంతో కొందరు బందీలను హమాస్ విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇంకా ఇజ్రాయెల్, విదేశీ బందీలు హమాస్ చెరలోనే ఉన్నారు. అయితే వారిని విడిపించేందుకు నేరుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతినిధి ఆడమ్ బోహ్లర్ రంగంలోకి దిగారు. హమాస్‌తో చర్చలు జరిపి.. బందీలను విడుదల చేయాలని కోరారు. గత వారం దోహాలో ఈ చర్చలు జరిగినట్లుగా తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: OTT : ఓటీటీలోకి 2025 బిగ్గెస్ట్ డిజాస్టర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?
ప్రస్తుతం హమాస్ చెరలో 59 మంది బందీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ బందీల్లో 5 మంది అమెరికన్లు ఉన్నట్లుగా సమాచారం. అయితే వారి విడుదల కోసం వైట్ హౌస్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్.. ఖతార్ ప్రధాన మంత్రిని కలవాలని అనుకున్నారు. కాల్పుల విరమణ గురించి చర్చించాలని భావించారు. కానీ అందుకు హమాస్ ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. దీంతో స్టీవ్ విట్కాఫ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య తొలి విడత కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఖైదీ-బందీల మార్పిడి జరిగింది. ఈ ఒప్పందం గత శనివారంతో ముగిసింది. మరో దఫా ఒప్పందం జరగాల్సి ఉంది. కానీ దీనిపై అనిశ్చితి నెలకొంది. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. హమాస్‌ను తీవ్రంగా హెచ్చరించారు. బందీలను విడుదల చేయకపోతే అంతు చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లు.. గాజాను విడిచి పెట్టాలని కూడా ట్రంప్ హెచ్చరించారు. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా మరోసారి యుద్ధానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: Chhava : తెలుగులో విడుదలకు అడ్డంకులు ఎదుర్కొంటున్న ‘ఛావా’..!