US Company Fires 2,700 Employees Through Text Message: ఆర్థికమాంద్యం, ద్రవ్యోల్భనం, కొనుగోలు శక్తి క్షీణించడం ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ఇప్పటికే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆర్థిక సమస్యలతో అల్లాడుతున్నాయి. ఆయా దేశాల్లో ప్రజలు పొదుపు చేసే పనిలో ఉన్నారు. ఫలితంగా వ్యాపారాలు తగ్గుతున్నాయి. దీంతో ఇటీవల కాలంలో అమెరికాలోని పలు టెక్ దిగ్గజాలు ఖర్చును తగ్గించుకునే పనిలో ఉద్యోగులను తొలగించుకున్నాయి. తాజాగా ఓ అమెరికన్ కంపెనీ తమ ఉద్యోగులను కేవలం ఓ టెక్ట్స్ మెసేజ్ చేసి తొలగించింది.
Read Also: Maharashtra: మోర్బీ ఘటన మరవకముందే.. చంద్రపూర్‌లో కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్..
మిస్సిస్సిప్పికి చెందిన ఓ ఫర్నీచర్ కంపెనీ నవంబర్ 21 అర్థరాత్రి ముందు దాదాపుగా 2700 మంది ఉద్యోగులను తొలగించిందని దిగార్డియన్ తెలిపింది. కంపెనీ ఉద్యోగులకు టెక్ట్స్ మెసేజులు, ఈమెయిళ్లు పంపి రేపటి నుంచి పనికి రావద్దని తెలిపింది. మిస్సిస్సిప్పిలోని యునైటెడ్ ఫర్నీచర్ కంపెనీ బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫాలు తయారు చేస్తుంది. ఈ కంపెనీ చెప్పాపెట్టకుండా ఉద్యోగులను తొలగించింది. బోర్డు డైరెక్టర్ల సూచన మేరకు.. అనుకోని వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో కంపెనీ బలవంతంగా ఉద్యోగులను తొలగించాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నామంటూ కంపెనీ ఉద్యోగులకు సందేశాన్ని పంపింది. కంపెనీ నుంచి ఉద్యోగుల తొలగింపు శాశ్వతంగా ఉంటుందని వెల్లడించింది.
డెలవరీలతో సంబంధం లేకుండా వెంటనే పరికరాలను, డెలవరీ పత్రాలను తిరిగి ఇవ్వాలని కంపెనీ డ్రైవర్లను ఆదేశించింది. ఉద్యోగుల తొలగింపుపై ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఉద్యోగులు వాపోతున్నారు. అయితే ఉద్యోగుల తొలగింపులో కంపెనీ చట్టాలను ఉల్లంఘించిందని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. అమెరికా వ్యాప్తంగా ప్రధాన టెక్ కంపెనీలు ట్విట్టర్, అమెజాన్, మెటా, గూగుల్ వంటి సంస్థలు తమ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చాయి. ట్విట్టర్ తన వర్క్ ఫోర్సులో 50 శాతం మంది, మెటా 11 వేల మందిని, అమెజాన్ 10 వేల మందిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇక స్ట్రీమింగ్ దిగ్గజాలు అయిన నెట్ ఫ్లిక్స్, డిస్నీలు కూడా ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి.