తూర్పు ఇరాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించగా, 50 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అధికారులు చెప్తున్నారు. తబాస్ సమీపానికి చేరుకున్న తర్వాత రైలులోని ఏడు బోగీల్లో నాలుగు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే.. మూడు హెలికాప్టర్లలో రెస్క్యూ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి తబాస్‌కు 550 కిలోమీటర్ల (340) దూరం ఉంటుంది. ప్రమాదం జరిగిన చోటు తబాస్‌కు దాదాపు 50 కిలోమీటర్ల (30 మైళ్లు) దూరంలో ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు స్పష్టం చేశారు. కాగా.. 2016లో ఇంతకంటే దారుణమైన రైలు ప్రమాదం చోటు చేసుకుంది. అందులో పదుల సంఖ్యలో మృత్యువాత పడగా.. చాలామంది గాయపడ్డారు. ఇవే కాదు.. రోడ్డు ప్రమాదాలు కూడా ఇరాన్‌లో చాలా ఎక్కువే!
ఇరాన్ రహదారుల్లో సంవత్సరానికి 17,000 మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో.. ప్రపంచంలోని ‘వరస్ట్ ట్రాఫిక్ సేఫ్టీ’ రికార్డ్స్ కలిగి ఉన్న దేశాల్లో ఇది ఒకటిగా నిలిచింది. ట్రాఫిక్ చట్టాలను విస్మరించడం, అసురక్షిత వాహనాలు, అత్యవసర సేవలు సరిపడ లేకపోవడం వల్లే మరణాల సంఖ్య అధికంగా ఉండటానికి కారణంగా తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వానికి ప్రజల జీవితాలంటే అంత చులకన అయిపోయిందా? ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదో?