North Korea: అమెరికా సైనికుడు ఉత్తర కొరియా శరణుకోరినట్టు ఆ దేశం ప్రకటించింది. అమెరికా సైన్యంలో నెలకొన్న వివక్ష మూలంగా తన మనస్సు వికలంగా మారిందని.. అందుకే శరణు కోరుతున్నట్టు సైనికుడు చెప్పాడని.. ఉత్తర కొరియా ప్రకటించింది. ఉత్తరకొరియాలో ప్రవేశించిన అమెరికా సైనికుడిపై తొలిసారిగా అక్కడి ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. ఉభయ కొరియాల మధ్య ఉన్న సంయుక్త గస్తీ నిర్వహణ ప్రాంతం నుంచి అక్రమంగా తమ దేశంలోకి ప్రవేశించిన అమెరికా సైనికుడు ట్రావిస్ టి.కింగ్ పై ఉత్తరకొరియా అధికారిక ప్రకటన చేసింది. అమెరికా సైన్యంలోని అమానవీయ ప్రవర్తన, జాతి వివక్ష కారణంగానే తాను సరిహద్దులు దాటి ఉత్తరకొరియాలోకి ప్రవేశించినట్లు సైనికుడు చెప్పాడని తెలిపింది. ఇందుకు సంబంధించి ఉత్తరకొరియా తొలిసారిగా అమెరికా సైనికుడిపై అధికారిక ప్రకటన జారీ చేసింది. ట్రావిస్ ఉద్దేశపూర్వకంగానే ఉత్తరకొరియాలో నివసించేందుకు సరిహద్దులు దాటినట్లు ప్యాంగ్‌యాంగ్ దర్యాప్తు బృందాలు కూడా నిర్ధారణ చేశాయి.
Read also: APL 2023: నేటి మ్యాచ్‌కు శ్రీలీల.. భారత్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్స్ గెలిచే అవకాశం!
అమెరికా సైన్యంలో అమానవీయ పరిస్థితులు, వివక్షతో బాధపడి ఉత్తర కొరియాలో ఉండేందుకు సరిహద్దులు దాటినట్లు తమ దర్యాప్తులో తేలిందని కేసీఎన్‌ఏ వార్తా సంస్థ కథనంలో ప్రకటించింది. అతడు ఉత్తరకొరియాలో లేదా మరేదైనా మూడో దేశంలో శరణార్థిగా ఉండేందుకు సానుకూలంగా ఉన్నాడని వార్తా సంస్థ పేర్కొంది. అయితే అతడి విషయంలో ప్యాంగ్‌యాంగ్ ఏం నిర్ణయం తీసుకుందో మాత్రం సంస్థ వెల్లడించలేదు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన అతడిని విచారించి శిక్షిస్తారా అనే విషయంలోనూ స్పష్టత లేదు. గత నెల జులై 18వ తేదీన కొందరు సందర్శకుల బృందంతో కలిసి 23 ఏళ్ల అమెరికా సైనికుడు ట్రావిస్ సంయుక్త గస్తీ ప్రాంతానికి చేరుకొన్నాడు. అక్కడి నుంచి అతడు ఉత్తరకొరియాలోకి పారిపోయాడు. అతడిని ఉత్తర కొరియా నుంచి విడిపించేందుకు అమెరికా ఐక్యరాజ్య సమితి(ఐరాస) కమాండ్ సాయంతో ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఉత్తర కొరియా ప్రకటనపై పెంటగాన్ అధికారి స్పందించారు. తమకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకొని తమ సైనికుడు ట్రావిస్‌ను సురక్షితంగా తమ దేశానికి చేర్చడమే తమ ప్రధమ కర్తవ్యమని స్పష్టం చేశారు.