Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఆయన అసమర్థత వల్లే అమెరికా ప్రతిష్ట రోజురోజుకు దిగజారుతుందని విమర్శిస్తు్న్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ ఆరోపణలతో పలు కేసులను ఎదుర్కొంటున్నారు ట్రంప్. ఇదిలా ఉంటే తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో అమెరికా వ్యతిరేక దేశాలు జతకడుతున్నాయని, అణుదాడులు చేస్తామని హెచ్చరిస్తున్నారని అన్నారు. బైడెన్ ప్రభుత్వ అసమర్థత వల్లే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. తన హయాంలో అణుయుద్ధంపై మాట్లాడేందుకు కూడా భయపడేవని, ఇప్పుడు అణు యుద్ధం తప్పదని ట్రంప్ హెచ్చరించారు.
Read Also: Batti Vikramarka : రాహుల్ గాంధీని కాపాడుకోవడమే ఈ దేశాన్ని కాపాడుకోవడం
అమెరికా కరెన్సీ విలువ పడిపోతోందని, ద్రవ్యోల్భణం అదుపులో లేదని, మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని ట్రంప్ అన్నారు. చైనా, రష్యా, ఇరాన్ , ఉత్తర కొరియా కూటమిగా ఏర్పడుతున్నాయని అన్నారు. చైనాతో రష్యా, సౌదీతో ఇరాన్ జతకట్టాయని నేను అధ్యక్షుడిగా ఉంటే ఇలాంటి పరిస్థితులు తలెత్తేవి కావని అన్నారు. తాను అధికారంలో ఉంటే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదని మరోసారి అన్నారు. డెమెక్రాట్లు అమెరికా ప్రతిష్టను దిగజారుస్తున్నారని విమర్శించారు ట్రంప్. న్యాయవ్యవస్థను ఉపయోగించుకుని ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు డెమెక్రాట్లు ప్రయత్నిస్తున్నారని అన్నారు.
పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్ తో శృంగార సంబంధాన్ని దాచేందుకు ఆమెకు ట్రంప్ పెద్ద ఎత్తున డబ్బు ఇచ్చాడనే ఆరోపణలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఆయనపై మొత్తం 34 అభియోగాలు నమోదు అయ్యాయి. మంగళవారం ఆయన న్యూయార్క్ కోర్టుకు హాజరయ్యారు. ఆ తరువాత ఫ్లోరిడాలోని తన నివాసం మారెలాగోలో తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను చేసిన తప్పేంటంటే.. మన దేశాన్ని నాశనం చేయాలనునకునే వారిని అడ్డుకోవడమే అని, మళ్లీ అమెరికాను గొప్పదేశంగా తీర్చిదిద్దుతాం అని అన్నారు. ఇదిలా ఉంటే ట్రంప్ డిసెంబర్ 4న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాల్సి ఉంది.