Ukraine War: ఉక్రెయిన్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. దాదాపుగా ఏడాదిన్నర గడుస్తున్నా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుందే తప్పా.. తగ్గడం లేదు. వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆయుధ, ఆర్థిక సాయంతో ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఉక్రెయన్ ను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపించింది. 30 క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగించింది. వీటిలో 29 క్షిపణులను కూల్చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది.
Read Also: New York Sinking: నేలలో కూరుకుపోతున్న న్యూయార్క్ నగరం.. తాజా అధ్యయనంలో వెల్లడి..
గురువారం తెల్లవారుజామున రష్యా క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్ పైకి ప్రయోగించింది. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ, క్షిపణులను అడ్డుకున్నట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. ఒడెసాలోని దక్షిణ ప్రాంతంలో పడిన ఓ క్షిపణి వల్ల ఒకరు మరణించగా.. ఇద్దరు గాయపడినట్లు ఉక్రెయిన్ సైన్యం వెల్లడించింది. రష్యా సైన్యం ఈ నెలలో తొమ్మిదో సారి రాజధాని కీవ్ ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ క్షిపణులను రష్యా సముద్రం, వైమానిక, భూ స్థావరాలను నుంచి ప్రయోగించినట్లు ఉక్రెనియన్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ వాలేరి జలుజ్నీ తెలిపారు. ఈ దాడిలో రష్యా హైపర్ సోనిక్ క్షిపణులను ఉపయోగించింది. అమెరికా నుంచి ఉక్రెయిన్ అందుకున్న పెట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థ క్షిపణుల దాడి నుంచి రాజధాని కీవ్ ను రక్షించింది.
యుద్దం ప్రారంభ సమయంలో ఉక్రెయిన్ వారం రోజుల్లో రష్యా చేతిలో పరాజయం పాలవుతుందని అంతా భావించారు. అయితే పాశ్చాత్యదేశాల సైనిక, వ్యూహాత్మక సాయంతో ఉక్రెయిన్, పటిష్టమైన రష్యాను ఎదురొడ్డి పోరాడుతోంది. అమెరికాతో పాటు యూకే, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలు ఆర్థికంగా, సైనికంగా ఉక్రెయిన్ కు అండదండలు అందిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ యుద్ధం వల్ల ఉక్రెయిన్ భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ తోపాటు ఒడిసా, ఖార్కీవ్, సుమీ, బాక్ముత్ వంటి నగరాలు నాశనం అయ్యాయి.