North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ పాలన ఎంత క్రూరంగా ఉంటుందో అందరికి తెలిసిందే. ఇతర మతాలను అచరించినా.. బైబిల్ పుస్తకాలన్ని కలిగి ఉన్నా, దక్షిణ కొరియా టీవీ కార్యక్రమాలు, సినిమాలు వీక్షించినా అక్కడ ప్రాణాలు పోవాల్సిందే. చివరకు తన మేనమామను కూడా వదిలిపెట్టలేదు కిమ్. ఆకలితో ఉన్న వందకు పైగా కుక్కల బోనులో అతడిని వదిలిపెట్టి అత్యంత క్రూరంగా చంపేశారు. కొన్నాళ్ల క్రితం దక్షిణ కొరియా సినిమాలు చూశారని ఇద్దరు హైస్కూల్ విద్యార్థులను ఉరితీసింది అక్కడి ప్రభుత్వం.
ఇదిలా ఉంటే ఉత్తర కొరియాలో బైబిల్ తో పట్టుబడిన క్రైస్తవులకు మరణశిక్ష విధించడంతో పాటు పిల్లలతో సహా వారి కుటుంబీకులకు జీవితఖైదు విధిస్తున్నట్లు అమెరికి విదేశాంగ శాఖ నివేదిక వెల్లడించింది. 2022 కోసం స్టేట్ డిపార్ట్‌మెంట్ యొక్క ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అంచనా ప్రకారం ఉత్తర కొరియాలో ఇతర మతాలకు చెందిన వారితో పాటు 70,000 మంది క్రైస్తవులు ఖైదు చేయబడ్డారు. తల్లిదండ్రులు బైబిల్ తో దొరికినందుకు 2 ఏళ్ల బాలుడికి కూడా యావజ్జీవ శిక్ష విధించింది నార్త్ కొరియా.
2009లో రెండేళ్ళ పిల్లవాడితో సహా మొత్తం కుటుంబానికి రాజకీయ జైలు శిబిరంలో జీవిత ఖైదు విధించారు. ఈ జైలులో క్రైస్తవులు భయానక పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. డిసెంబర్ 2021లో, కొరియా ఫ్యూచర్ ఒక నివేదికను విడుదల చేసింది.దీంట్లో నార్త్ కొరియాలో మహిళపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగాయనేది వెల్లడించింది. 151 మంది క్రైస్తవ మహిళనలను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా ఈ నివేదిక రూపొందించారు. నిర్భందం, లైంగిక హింస, బలవంతంగా పనులు చేయడం వంటి దారుణాలు జరిగేవని వెల్లడించింది. అత్యాచారాలు, రక్తాన్ని పీల్చడం, అవయవాల సేకరణ, హత్యలకు పాల్పడే వారిని తెలిపింది.