ఎవరెస్ట్ శిఖరంపై విషాద ఘటన చోటుచేసుకుంది. నేపాల్‌కు చెందిన ఓ పర్వతారోహకుడు ఎవరెస్ట్ శిఖరంపైనే ప్రాణాలు కోల్పోయాడు. 38 ఏళ్ల ఎంజిమి టెన్జీ షెర్పా అనే పర్వతారోహకుడు గతంలో అనేకసార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అయితే తాజాగా మరోసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కే క్రమంలో చదునుగా ఉండే ప్రాంతంలో కూర్చున్న అతడు విగతజీవుడై కనిపించాడు. ఎంజిమి షెర్పా ఎవరెస్ట్‌పైనే మరణించడం పలువురు పర్వతారోహకులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
అయితే షెర్పా ఎలాంటి ప్రమాదానికి గురికాలేదని తెలుస్తోంది. అతడు ఎత్తయిన ప్రదేశానికి చేరిన సమయంలో తీవ్ర అస్వస్థత కలగడంతోనే ప్రాణాలు విడిచాడని ప్రత్యక్ష సాక్షులు వివరించారు. షెర్పా ఎవరెస్ట్ పై క్యాంప్-2కు వివిధ రకాల సామగ్రి తీసుకువెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు. అతడు చనిపోయిన ప్రదేశంలో షెర్పా వీపునకు బ్యాక్ ప్యాక్ అలాగే ఉందని పేర్కొన్నారు. కాగా 8,848 మీటర్లు, 29,028 అడుగులతో ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంతో వందలాది మంది ప్రతి ఏటా ప్రయత్నిస్తుంటారు. అయితే వారి కలల సాకారానికి నేపాలీ గైడ్లు, పోర్టర్లు ఎంతో సహకరిస్తుంటారు. ప్రతి సాహసయాత్ర కోసం అవసరమైన టెంట్లు, ఆహారం, ఆక్సిజన్, తాగునీటి బాటిళ్లను ఎత్తైన శిబిరాలకు మోసుకెళ్లే క్రమంలో అనేక మంది ప్రమాదాలబారినపడి చనిపోతుంటారు.