ఒకప్పుడు బర్డ్ ఫ్లూ పేరు చెప్పగానే జనం హడలిపోయారు. దేశంలో చికెక్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. దేశంలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. బీహార్ లో వరుసగా పక్షులు చనిపోవడం అధికారులను ఆందోళనకు గురి చేస్తుంటే.. వ్యాపారులు మాత్రం టెన్షన్ పడుతున్నారు. దీంతో బీహార్ లో చికెన్ తినకుండా చూడాలని జిల్లా అధికారులు ప్రజలను ఆదేశించారు. మళ్లీ తమకు గడ్డురోజులు వచ్చినట్టేనని వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు.
గత కొన్నాళ్ళుగా బీహార్‌లోని సుపాల్ జిల్లాలో వరుసగా పక్షులు చనిపోతున్నాయి. చప్కాహి గ్రామంలో గత నెలలో అనుమానాస్పదంగా బాతులు, కోళ్లు, ఇతర పక్షులు చనిపోయాయి. అసలేం జరుగుతుందో తెలీక అక్కడి రైతులు, యజమానులు అధికారులకు విషయం తెలిపారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో, చనిపోయిన పక్షుల సాంపిల్స్‌ను భోపాల్‌లోని ల్యాబ్‌కు టెస్టుల కోసం పంపారు. ఈ టెస్టుల్లో పక్షులకు ఏమియన్ బర్డ్ ప్లూ (H5N1) బర్డ్ ఫ్లూ సోకినట్టుగా నిర్దారించారు. శాంపిల్స్ సేకరించిన ప్రాంతంలో అందరినీ అప్రమత్తం చేశారు.
వ్యాధి సోకిన ప్రాంతం నుంచి కిలోమీటర్ వ్యవధి వరకు పౌల్ట్రీ ఫారాల్లోని కోళ్లను చంపేయాలని అధికారులు ఆదేశించారు. అక్కడివారు కొద్దిరోజుల పాటు చికెన్ తినకుండా చూడాలని ఆదేశించారు. కోళ్ల ఫారాల్లో కోళ్లను చంపి వాటిని పాతిపెట్టేందుకు ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని పంపుతున్నారు. ఏమియన్ బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ళను పెద్ద పెద్ద గోతుల్లో వేసి పాతిపెడుతున్నారు. ఈ ఫ్లూ ఇతర రాష్ట్రాలకు సోకుతుందేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కరోనా వల్ల వ్యాపారాలు దెబ్బతిన్నాయని, మళ్ళీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ వస్తే తమ పరిస్థితి అగమ్యగోచరమే అంటున్నారు చికెన్ వ్యాపారులు.