ప్రపంచాన్ని ప్రస్తుతం మంకీపాక్స్ కలవరపెడుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో మంకీపాక్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కేవలం సెంట్రల్ ఆఫ్రికా దేశాలకే పరిమితం అయిన మంకీపాక్స్ ప్రస్తుతం యూరప్, అమెరికా దేశాలకు పాకింది. బ్రిటన్ లో మొదటిసారిగా ఈ ఏడాది మే మొదటి వారంలో తొలికేసు నమోదు అయింది. నైజీరియా నుంచి వచ్చిన వ్యక్తిలో ఈ వ్యాధిని కనుక్కున్నారు. ఆ తరువాత నుంచి పదుల సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి. అమెరికాలో మే 18న తొలి కేసు నమోదు అవ్వగా.. ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో 9 వరకు కేసులు నమోదు అయ్యాయి.
ఇదిలా ఉంటే మంకీపాక్స్ తో ఈ ఏడాదిలో తొలిమరణం సంభవించింది. నైజీరియాలో ఈ ఏడాది మంకీపాక్స్ తో మరణం నమోదు అయిందని నైజీరియా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆదివారం ప్రకటించింది. 2022లో మొత్తం 66 కేసులు నమోదు అయితే 21 మందికి వ్యాధిని ధ్రువీకరించారు. సాధారణంగా సెంట్రల్ ఆఫ్రికా దేశాలైన కాంగో, నైజీరియా దేశాల్లో ఈ మంకీపాక్స్ ఎక్కువగా నమోదు అవుతుంది. కాగా ప్రస్తుతం మరణించిన 40 ఏళ్ల వ్యక్తి వ్యాధి నిరోధక శక్తిని తక్కువ చేసే( ఇమ్యూనో సప్రసివ్) మందులు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 20 దేశాల్లో 200పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, బ్రిటన్, స్పెయిన్, బెల్జియం, జర్మనీ, ప్రాన్స్, ఇజ్రాయిల్, యూఏఈ వంటి దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. అయితే రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉన్నవారిలో రెండు వారాల్లో ఈ వ్యాధి నయం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. స్వలింగ సంపర్కంతో వ్యాధి ప్రబలే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మశూచి వ్యాధిలో లాగే శరీరంపై దద్దర్లతో పాటు లింప్ నోడ్స్ వాచి ఉండటం, తలనొప్పి వంటి లక్షణాలు మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తిలో ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు.