Maha Shivratri celebrations in US: అమెరికా, కమ్మింగ్ నగరంలోని శివ దుర్గాలయంలో… పండిట్ కార్తీక్ దీక్షిత్ స్వామి సారథ్యంలో మహా శివరాత్రి వేడుకలు మహా సంబరంగా జరిగాయి. ఫిబ్రవరి 18 ఉదయం 7 గంటలకు మొదలైన సప్త కళాభిషేకం… తెల్లవారుఝాము 4 గంటల వరకు నిర్విఘ్నంగా, అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించారు. పది వేలకు పైగా ప్రవాస భారతీయ భక్తులు తరలి వచ్చి శివ పారవశ్యంలో మునిగి తేలారు. ఈ సందర్భంగా సృష్టి స్థితి లయకారుడైన పరమ శివుని వివిధ రూపాలు సాక్షాత్కరింపజేయడంతో భక్తజనం పులకించిపోయింది. “అర్ధ నారీశ్వరం, లింగోద్భవం, భస్మాభిషేకం” వంటి రూపాలు భక్తుల్ని సమ్మోహితుల్ని చేశాయి. ఇక్కడి శివ దుర్గ ఆలయంలో… హిందూ పండుగలు అన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. శివ రాత్రి సందర్భంగా పది వేలకు పైగా భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చినప్పటికీ.. ఎవరికీ ఏ చిన్న అసొకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవడం, వారికి రెండు వందల పైచిలుకు స్వచ్ఛంద సేవకులు సహకరించడం అభినందనీయం!!..
Read Also: Aadhaar Card Alert: ఆధార్ జిరాక్స్‌లు ఎక్కడా ఇవ్వొద్దు..! క్లారిటీ ఇచ్చిన యూఐడీఏఐ
కాగా, శివరాత్రి సంబరాలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగిన విషయం విదితమే.. ముఖ్యంగా భారత్‌లో శివరాత్రి మహోత్సవాలకు ప్రత్యేకత ఉంది.. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు కూడా శివరాత్రి పూట.. శివనాస్మరణతో.. ఉపవాస దీక్షలు, జాగారాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ శైవ క్షేత్రాలకు శివరాత్రి నేపథ్యంలో భక్తుల రద్దీ గట్టిగా ఉంటుంది.. శివరాత్రిని పురస్కరించుకుని శైవ క్షేత్రాల్లో బ్రహ్మోత్సవాలు సైతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.