Russia – Ukraine Conflict: ఉక్రెయిన్‌పై యుద్ధానికి సపోర్టుగా ఉత్తర కొరియా, రష్యాకు పెద్ద మొత్తంలో సైనికులను తరలించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో కిమ్ సైనికుల్లో కొందరు చనిపోయారని వ్లొదిమీర్ జెలెన్‌స్కీ తాజాగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థకు తెలిపారు. తమపై యుద్ధానికి కుర్స్క్‌లో 11వేల మంది కిమ్ సైనికులను మోహరించినట్లు గతంలో జెలెన్‌స్కీ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన పోరాటంలో పాల్గొన్న ఆ సైనికులు కీవ్ దళాల చేతుల్లో చనిపోయినట్లు చెప్పుకొచ్చారు. తాము కఠిన చర్యలు తీసుకోకపోతే అక్కడ మరిన్ని బలగాలు మోహరించే ఛాన్స్ ఉందన్నారు. అయితే, ఈ పోరాటంలో ఎంత మంది సైనికులు మృతి చనిపోయారనే దానిపై స్పష్టత లేదన్నారు.
దాదాపు రెండేళ్లకు పైగా రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సంచలన కామెంట్స్ చేశారు. యుద్ధం ముగియాలంటే కీవ్ దూకుడు తగ్గించి తటస్థంగా ఉండాలని చెప్పుకొచ్చారు. యుద్ధం ముగిసి శాంతిని నెలకొల్పాలంటే ఉక్రెయిన్ తటస్థంగా ఉండాలి.. అలా జరగకపోతే.. ఆ దేశం కొందరు వ్యక్తుల చేతుల్లో చిక్కి రష్యన్ ఫెడరేషన్ ప్రయోజనాలకు హాని కలిగించే ఆయుధంగా మారుతుంది అన్నారు. యుద్ధం ముగిస్తే కీవ్‌లో నెలకొన్న దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపాలని తాము నిర్ణయించుకున్నాం.. ఉక్రెయిన్ సరిహద్దులు నిర్ణయించి నిర్దిష్ట భూభాగాల్లో నివసించే ప్రజలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వ్లాదిమిర్ పుతిన్ చెప్పుకొచ్చారు.