ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మరోసారి మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా ఇరాన్‌ను మరోసారి ఇజ్రాయెల్ తీవ్రంగా హెచ్చరించింది. యూదు రాజ్యాన్ని ఇరాన్ బెదిరించడం కొనసాగిస్తే.. మళ్లీ టెహ్రాన్‌పై దాడి చేయడమే కాకుండా ఖమేనీని కూడా లక్ష్యంగా చేసుకుంటామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ హెచ్చరించారు. ఆదివారం ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన రామన్ వైమానిక స్థావరాన్ని కాట్జ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సమక్షంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.
‘‘నేను నియంత ఖమేనీకి స్పష్టమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఇజ్రాయెల్‌ను బెదిరించడం కొనసాగిస్తే.. మా చేయి మళ్లీ టెహ్రాన్‌కు చేరుకుంటుంది. మరింత ఎక్కువ శక్తితో.. ఈసారి మీకు వ్యక్తిగతంగా నష్టం జరగొచ్చు.’’ అని కాట్జ్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Suleman Musa: పహల్గామ్ సూత్రధారి సులేమాన్ మూసా హతం.. అసలు ఇతడెవరు?
ఇటీవలి ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. ఆ సమయంలో ఇరాన్ సైనిక, అణు ఆస్తులను లక్ష్యంగా చేసుకున్న ఆపరేషన్ రైజింగ్ లయన్‌లో ఇజ్రాయెల్ ఫైటర్ జెట్ సిబ్బంది పాత్రను కాట్జ్ ప్రశంసించారు. ఇరానియన్ ఆక్టోపస్ తలపై పదేపదే దాడి చేశారని.. వినాశన బెదిరింపులను తొలగించారని కాట్జ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sofiya Qureshi: విజయ్ షాకు ఊరట.. సోఫియా ఖురేషి కేసులో సుప్రీంకోర్టులో ఉపశమనం
ఇటీవల ఖమేనీ.. ఇజ్రాయెల్‌ను బెదిరించారు. ఈసారి దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇజ్రాయెల్‌ను హెచ్చరించారు. ఇప్పటి కంటే ఎక్కువ దాడి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. భారీ దాడికి సిద్ధంగా ఉన్నట్లు ఖమేనీ పేర్కొన్నారు. తాజాగా ఖమేనీ వ్యాఖ్యలకు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కౌంటర్ ఎటాక్ చేశారు. బెదిరింపులు మానుకోకపోతే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఖమేనీని హెచ్చరించారు.
జూన్ 13న ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. అనంతరం అమెరికా కూడా దాడులు చేసింది. అనంతరం ట్రంప్.. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రకటించారు. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అధికారుల ప్రకారం 1,060 మంది మరణించారు. వీరిలో సీనియర్ ఇరాన్ సైనిక కమాండర్లు, అణు శాస్త్రవేత్తలు, పౌరులు ఉన్నారు. ఇక ఇజ్రాయెల్‌లో కనీసం 28 మంది మరణించారని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ పేర్కొంది.