Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో గాజా ప్రాంతంలోని అల్-షిఫా ఆస్పత్రి హాట్‌స్పాట్‌గా మారింది. ఈ ఆస్పత్రినే హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్‌గా, ఆయుధాలు దాచేందుకు స్థావరంగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఆర్మీ ఆధారాలతో బయటపెట్టింది. ఆస్పత్రి కింద టన్నెల్స్, ఇతర ఏర్పాట్లను గుర్తించింది. ఇదే కాకుండా గాజాలోని పలు ఆస్పత్రుల కింద ఇలాంటి నిర్మాణాలే ఉన్నాయని ఇజ్రాయిల్ పేర్కొంది.
ఇదిలా ఉంటే అల్-షిఫా ఆస్పత్రి డైరెక్టర్‌తో పాటు ఇతర డాక్టర్లను ఇజ్రాయిల్ దళాలు గురువారం అరెస్ట్ చేశాయి. డైరెక్టర్ మొహమ్మద్ అబు సాల్మియాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఇతను అల్-షిఫా ఆస్పత్రి పరిణామాలు, ఇజ్రాయిల్ దాడుల గురించి తరుచుగా ఇంటర్నేషనల్ మీడియాకు వెల్లడిస్తుండే వాడు. ఇజ్రాయిల్ భూతల దాడులు ప్రారంభించనప్పటి నుంచి ఈ ఆస్పత్రిపై వరసగా దాడులు నిర్వహించింది.
Read Also: CM KCR: అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం కొత్త ఐటీ పార్క్..
ఈ ఆస్పత్రిలోని చాలా ప్రాంతాల్లో హమాస్ కార్యకలాపాలను ఇజ్రాయిల్ గుర్తించింది. అయితే దీన్ని హమాస్ ఉగ్రవాదులు ఖండించారు. డాక్టర్ మహ్మద్ అబు సాల్మియాతో పాటు మరికొందరు సీనియర్ వైదుల్ని అరెస్ట్ చేసినట్లు ఆస్పత్రి విభాగం చీఫ్ ఖలీద్ అబు సమ్రా కూడా ధృవీకరించారు.వ వీరిని అరెస్ట్ చేయడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. రెడ్ క్రాస్, ఇతర సంస్థలకు వీరి విడుదల గురించి పిలుపునిచ్చింది. ఈ ఆస్పత్రిని ఖాళీ చేయాలని ఇజ్రాయిల్ శనివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో చాలా మంది రోగులు కాలినడకనే దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లారు.
అక్టోబర్ 7న జరిగిన దాడిలో హమాస్ ఇజ్రాయిల్ లోని 1200 మంది చంపేసింది. దీంతో పాటు 240 మందిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ వరసగా గాజా స్ట్రిప్ పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 13 వేలకు మించి ప్రజలు చనిపోయారు. వీరిలో చాలా మంది పిల్లలు కూడా ఉండటంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.