Imran Khan: పాకిస్తాన్ మాజీ సీఎం, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను అక్కడి షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాల జైలులో వేసింది. ఇటీవల, ఆయన మరణించాడనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ మద్దతుదారులు తీవ్ర ఆందోళనలు నిర్వహించారు. చివరకు ఇమ్రాన్ సోదరికి, ఆయనను కలిసేందుకు అవకాశం ఇవ్వడంతో ఊహాగానాల తప్పని తేలింది. అయితే, తన సోదరుడిని జైలులో మానసిక హింసకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించింది. ఆయన పరిస్థితికి పాక్ సైనిక చీఫ్ అసిమ్ మునీర్ కారణమని ఆరోపించింది.
ఇదిలా ఉంటే, తమ తండ్రి ఇమ్రాన్ ఖాన్‌ను ‘‘డెత్ సెల్’’లో మానసిక హింసకు గురిచేస్తున్నారని, బహుశా జైలులో ఉన్న తమ తండ్రిని మళ్లీ ఎప్పటికీ చూడలేమేమో అని ఆయన కుమారులు కాసిం ఖాన్, సులైమాన్ ఇసా ఖాన్ అన్నారు. స్కై న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉన్నారు. తాము నెలల తరబడి తమ తండ్రిని చూడలేదని, మాట్లాడలేదని వారు అన్నారు.
ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ మాట్లాడుతూ.. తన తండ్రి రెండేళ్లుగా ఒంటరి నిర్భందాన్ని ఎదుర్కొంటున్నారని, జైలులో ఆయనకు మురికి నీరు ఇస్తున్నారని, హెపటైటిస్‌తో చనిపోతున్న ఖైదీల మధ్య ఆయన ఉన్నారని అన్నారు. ఆయనకు ఎలాంటి మానవ సంబంధాలు లేకుండా పూర్తిగా ఏకాంతంలో ఉంచారని ఆరోపించారు. తమ తండ్రిని మానసిక హింసకు గురిచేస్తున్నారని, జైలు గార్డులను కూడా ఆయనతో మాట్లాడటానికి అనుమతించడం లేదని అన్నారు. ఈ సమయంలో ఆయన బయటపడే మార్గాలు కష్టమవుతున్నాయని, పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని, ఆయనను మళ్లీ ఎప్పటికీ చూడలేమో అనే భయం అవుతుందని కాసిం ఖాన్ అన్నారు.