Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అని, రాజ్యాంగానికి లోబడే నిర్ణయం ఉందని తెలిపింది. ఆర్టికల్ 370 కేవలం తాత్కిలిక సదుపాయం మాత్రమే అని, ఇది దేశంలో అవిభాజ్య అంతర్భాగమని చెప్పింది. అయితే జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రానికి సూచించింది.
ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు తీర్పుపై పాకిస్తాన్ తన అక్కసును వెళ్లగక్కుతోంది. భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు చట్టబద్ధత లేదని మూర్ఖపు వాదనకు దిగింది. మరోవైపు పాకిస్తాన్‌కి ఇస్లాం దేశాల గ్రూప్ ‘‘ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్(ఓఐసీ)’’ కూడా వంత పాడుతోంది. సుప్రీంకోర్టు తీర్పుతో మంగళవారం ఓఐసీ ప్రధాన కార్యదర్శి ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తన సంఘీభావాన్ని పునరుద్ఘాటిస్తూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసి విష్ణుదేవ్ సాయ్.. ప్రధాని మోడీ హాజరు..
ఇదిలా ఉంటే ఇస్లాం దేశాల గ్రూపుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఐసీ చేసిన వ్యాఖ్యలను భారత్ బుధవారం తీవ్రంగా ఖండించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మాట్లాడుతూ.. ‘‘మానవ హక్కుల్ని ఉల్లంఘించే వ్యక్తి, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రమోట్ చేసే వారి’’ ఆదేశాల మేరకు ఓఐసీ ఈ వ్యాఖ్యలు చేస్తోందని పరోక్షంగా పాకిస్తాన్‌ని ఉద్దేశించి విమర్శించారు.
‘‘భారత సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) జనరల్ సెక్రటేరియట్ జారీ చేసిన ప్రకటనను భారతదేశం తిరస్కరిస్తుంది. ఇది సమాచారం లేనిది మరియు అనాలోచితమైనది’’ అని బాగ్చీ అన్నారు. ఓఐసీ మానవ హక్కుల్ని ఉల్లంఘించే వారి ఆదేశాలపై వ్యాఖ్యలు చేస్తో్ందని, ఇలాంటి ప్రకటనలు ఓఐసీ విశ్వసనీయతను దెబ్బతీస్తాయని భారత్ హితవు పలికింది. గతంలో కూడా ఇలాగే పలుమార్లు భారత అంతర్గత విషయమైన కాశ్మీర్‌పై ఓఐసీ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీనికి భారత్ గట్టిగానే బదులిచ్చింది.