కోవిడ్ కేసులు పెరగడంతో స్కూళ్లకు సెలవులిచ్చేస్తున్నాయి ప్రభుత్వాలు. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంతకీ కరోనా విజృంభిస్తే స్కూళ్లు మూసేయాలా? ప్రపంచ బ్యాంక్ విద్యారంగం డైరెక్టర్ జేమీ సావెద్రా దీనిపై పరిశోధన చేశారు. విద్యా వ్యవస్థపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బకొట్టింది. కరోనా కారణంగా నెలలపాటు పాఠశాలలు మూతబడ్డాయి. ఇప్పటికీ పలు దేశాల్లో విద్యార్థులు భౌతికంగా స్కూళ్లకు హాజరుకాలేకపోతున్నారు.
అయితే, ఈ కారణంగా పాఠశాలలను మూసివేయడాన్ని ప్రపంచబ్యాంకు సమర్థించుకోలేమంటోంది. విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్ జేమీ సావెద్రా కొత్త వేరియంట్లు వస్తే తప్పని పరిస్థితుల్లో మాత్రమే చివరి నిర్ణయంగా స్కూళ్లను మూసివేయాలని సూచించారు.
పాఠశాలలు సురక్షితం కాదని, తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయనే దానిపై ఎలాంటి ఆధారాలు లేవని సావెద్రా అన్నారు. బడులు తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదన్నారు. పిల్లలకు టీకాలు వేసేంతవరకు వేచి ఉండటం సమంజసం కాదని, దాని వెనుక ఎలాంటి శాస్త్రీయత లేదని ఆయన స్పష్టం చేశారు.
బార్లు, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాళ్లను తెరిచి.. కేవలం స్కూళ్లను మూసివేయడంలో ఎలాంటి అర్థం లేదన్నారు. బడులను తెరిచినా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువే అని పలు అధ్యయనాల్లో తేలిందని… కరోనా ప్రభావం పిల్లలపై తక్కువే అన్నారు సావెద్రా.
2020కు సంబంధించి ప్రపంచ బ్యాంకు విద్యా విభాగంఓ నివేదికను రూపొందించింది. ఒక దేశంలో కరోనా కారణంగా పాఠశాలలను దీర్ఘకాలికంగా మూసివేయడం వల్ల భవిష్యత్తులో 400 బిలియన్ డాలర్లకు మించి నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. స్కూళ్ల మూసివేత కారణంగా భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని సావెద్రా హెచ్చరించారు. పాఠశాలలు తెరవడం వల్లే కేసులేమైనా పెరిగాయా? అనే విషయంపై అధ్యయనం చేయగా అలా జరగలేదని తేలిందన్నారు.