Justin Trudeau: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో మరోసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ పై ఆరోపణలు చేశారు. నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని అన్నారు. తమ వద్ద విశ్వసనీయ కారణాలు, సమాచారం ఉందని వెల్లడించారు. ఖలిస్తాన్ వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ, భారత వ్యతిరేకతకు పాల్పడుతున్న నిజ్జర్ ని మన ప్రభుత్వం ఉగ్రవాదిగా గుర్తించింది. ఇతన్ని ట్రూడో కెనడియన్ గా ప్రస్తావించారు.
సోమవారం తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఎవరైనా పౌరుడిని సొంతదేశంలోనే హత్య చేయడం ఆమోదయోగ్యం కాదని, తాము చట్ట పాలన కోసం నిలబడుతున్నామని ట్రూడో అన్నారు. తాము భారత్ ని రెచ్చగొట్టడం లేదని స్పష్టం చేస్తూనే.. ఈ హత్య కేసు విచారణలో భారత సహకారం ఉండాలని కోరారు. కెనడా పౌరులను సురక్షితంగా ఉంచాలని తమ ప్రభుత్వం చూస్తుందని, నిజ్జర్ హత్య కేసును సీరియస్ గా తీసుకోవాలని భారత్ కి సూచించారు.
Read Also: JDS: బీజేపీ కూటమిలోకి జేడీఎస్.. రేపు చేరే అవకాశం..
నిజ్జర్ హత్యపై తాను ప్రధాని నరేంద్రమోడీతో సూటిగా, స్పష్టంగా మాట్లాడానని, తన ఆందోళనలను పంచుకున్నానని ట్రూడో వెల్లడించారు. కెనడాకు స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలమైన ప్రక్రియ ఉన్నాయని మేము దాన్ని అనుసరిస్తామని అన్నారు. భారత్ ప్రాముఖ్యత గల దేశం అనడంలో సందేహం లేదని, మేము ఒక రీజియన్ లోనే కాకుండా ప్రపంచమంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలోని బ్రిటీష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఇతను భారత ప్రభుత్వం చేత ఉగ్రవాదిగా గుర్తించబడ్డాడు. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై భారత్ లో పలు కేసులు కూడా ఉన్నాయి. ఖలిస్తాన్ టైగర్ ఫ్రంట్ పేరుతో ఓ ఉగ్రసంస్థను నడుపుతున్నాడు.