తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభం, ఆహార కొరతతో అల్లాడిపోతున్న శ్రీలంకలో శనివారం సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంక్షోభాన్ని పరిష్కరించడంలో విఫలమైన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జనం రణరంగం సృష్టించారు. కడుపు కాలితే ఆగ్రహ జ్వాల ఎలా ఉంటుందో శ్రీలంక రాజధాని కొలంబో శనివారం ప్రత్యక్షంగా చవిచూసింది. ఆర్థిక సంక్షోభంతో నరకప్రాయ జీవితాన్ని అనుభవిస్తున్న ప్రజానీకం మహోగ్రసెగలు లంక పాలకుల్ని నేరుగా తాకాయి. ప్రవాహంలా మొదలైన ప్రజాందోళన శ్రీలంక అధ్యక్ష భవనంపైకి సునామీలా పోటెత్తింది. కొలంబో వీధులు శనివారం రణరంగాన్ని తలపించాయి. ముంచుకొస్తున్న ముప్పును ముందుగానే పసిగట్టిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స అధ్యక్ష భవనాన్ని విడిచిపెట్టి శుక్రవారం రాత్రే పరారయ్యారు. ఈ నిరసన సెగల్ని తట్టుకోలేక.. ఎట్టకేలకు ఈ నెల13న గద్దె దిగేందుకు అంగీకరించారు. ఈ మేరకు స్పీకర్‌కు సమాచారం అందించారు. శనివారం జరిగిన ఆందోళనల నేపథ్యంలో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు.
Srilanka Crisis: అధ్యక్ష భవనంలో నిరసనకారుల మందు, విందు, చిందు.. వీడియోలు వైరల్
గొటబాయ రాజపక్స నియమించిన ప్రధాని విక్రమసింఘేను కూడా ఆందోళనకారులు వదల్లేదు. తాను పదవికి రాజీనామా చేస్తానని స్వయంగా ప్రకటించినా.. ఆయన ప్రైవేట్ నివాసానికి నిప్పుపెట్టారు. మొత్తంమీద కొలంబో వీధుల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో 115 మందికి గాయాలయ్యాయి. 8మంది ఆర్మీ సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. 14 మంది జర్నలిస్టులకు తీవ్ర గాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇన్ని ఆందోళనల నడుమ చివరికి దేశంలో అఖిలపక్ష ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.