Srilanka Crisis: శ్రీలంకలో రాజకీయ అధికారం మారినా.. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికీ ప్రజలు నిత్యావసరాలు దొరకడం గగనం అయిపోయింది. పెట్రోల్, డీజిల్ కోసం పెద్దపెద్ద క్యూల్లో నిలబడుతున్నారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అన్ని రంగాలను దెబ్బతీసింది. ఫలితంగా చాలా మంది ఉద్యోగం, ఉపాధి కోల్పోయారు. పని చేసేందుకు సిద్ధంగా ఉన్న పని లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలో నేరాలు పెరుగుతున్నాయి.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో పని దొరకకపోవడంతో పాటు తినడానికి తిండి కూడా దొరకక యువకులు నేరాలకు పాల్పడుతున్నారు. లంకలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. డబ్బుల కోసం లంకలోని యువత దొంగలుగా మారుతున్నారు. పెట్రోల్ కోసం క్యూలో ఉండే కార్ల నుంచి తమకు దొరికింది దొంగతనం చేస్తున్నారు. ఈ మేరకు శ్రీలంకలో భద్రతా సిబ్బందికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. మరోవైపు డబ్బుల కోసం సంపన్నులను టార్గెట్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇవ్వకపోతే కాల్చి చంపడానికి కూడా వెనకాడడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీలంకలో జరిగింది. డబ్బులు ఇవ్వనివారిని నడిరోడ్డుపై గన్‌తో కాల్చి చంపేశారు. ఆదివారం రాత్రి కొలంబోలోని వివేకానంద రోడ్డుపై ఓ వ్యాపారిపై కాల్పులు జరిపి చంపేశారు. డబ్బుల కోసమే అతనిని హత్య చేసినట్లు కొలంబో భద్రతా సిబ్బంది తెలిపారు. లంకలో అధికారం మారినా పరిస్థితుల్లో మార్పు కనిపించకపోవడం గమనార్హం.
భారతీయులు నమోదు చేసిన 10 వింత గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్
ఇదిలా ఉండగా శ్రీలంక ఆర్థిక సంక్షోభం మహిళల పాలిట నరకంగా మారుతోంది. ఆర్థిక సంక్షోభం, పేదరికం కారణంగా చాలా మంది మహిళలు వ్యభిచార కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. మహిళ పరిస్థితులను వాడుకుని అక్కడి స్పా యజమానులు, నిర్వాహకులు మహిళలతో సెక్స్ వర్క్ చేయిస్తున్నారు. కుటుంబం గడవాలన్నా.. పిల్లలకు తిండి పెట్టాలన్నా, మనసుకు ఇష్టం లేకపోవయినా మహిళలు తమ శరీరాలను అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా వస్త్రపరిశ్రమల కుంటుపడటంతో ఆ రంగంలో పనిచేసే మహిళలు వ్యభిచారంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారి కుటుంబాలకు వేరే ప్రత్యామ్నాయం, ఆదాయం లేకపోవడంతో చివరికి వారి భర్తలు కూడా వారిని విడిచిపెడుతున్నారు.