Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లో పలు ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయుల గురించి మాట్లాడుతూ.. వారు భద్రతా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించారు. భద్రతా క్రమశిక్షణ పాటించాలని కోరినప్పడు వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు శుక్రవారం చెప్పారు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో జరిగిన దాడిలో ఐదుగురు చైనా జాతీయులు మరణించిన తర్వాత ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Also: Man Kills Daughter: చదువుకోవడం లేదని.. 17 ఏళ్ల కుమార్తెపై దారుణం..
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురైన మరియం ఇటీవల పంజాబ్ సీఎంగా ఎన్నికయ్యారు. తన తొలి అపెక్స్ మీటింగ్‌లో మాట్లాడన ఆమె.. ఇక్కడ నివసిస్తున్న చైనీయులు భద్రతా క్రమశిక్షణ పాటించడానికి ఇష్టపడటం లేదని అన్నారు, సెక్యూరిటీ ప్రోటోకాల్ అనుసరించాలని అడిగినప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, వారు ఏ క్రమశిక్షణ కిందకు రావాలని కోరుకోవడం లేదని అన్నారు. ఈ సమావేశంలో కార్ప్స్ కమాండర్ లాహోర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అమీర్ రజా మరియు ఇతర సీనియర్ సైనిక అధికారులు కూడా పాల్గొన్నారు. పంజాబ్ ప్రావిన్స్ అభివృద్ధి ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనా జాతీయులకు ఫూల్ ప్రూఫ్ భద్రతను కల్పిస్తామని ఆమె చెప్పారు. బిషమ్‌లో చైనా ఇంజనీర్ల హత్యను ఆమె ఖండించారు.
ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని దాసు జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఐదుగురు చైనీయులు ఆత్మాహుతి దాడిలో మరణించారు. షాంగ్లా జిల్లాలోని బిషమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రవాదం డిజిటలైజ్ అయిందని, వారి కంటే ముందు ఉండాలని, ఉగ్రవాదుల చేతిలో అత్యాధునిక ఆయుధాలు, సాంకేతికత ఉందని ఆమె అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న ఆయుధాలు పెద్ద సవాల్‌గా మారినట్లు మరియం చెప్పారు. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ కింద చైనా పాకిస్తాన్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను నిర్మిస్తోంది. దీంతో పాటు డ్యామ్‌లు, రోడ్లు, రైల్ నెట్వర్క్‌తో పాటు గ్వాదర్ పోర్టును డెవలప్ చేస్తోంది.