తైవాన్ విషయంలో తాము యుద్ధానికి కూడా సిద్ధమని చైనా స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. చైనా తైవాన్‌ను తన భూభాగంగా భావించడమే కాకుండా ఏదో ఒకరోజు స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయం తెలిసిందే. తైవాన్‌కు స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే.. యుద్ధం ప్రారంభించడానికి ఏ మాత్రం వెనుకాడబోమని చైనా తేల్చిచెప్పింది. సింగపూర్ వేదికగా జరిగిన సమావేశంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌కు చైనా రక్షణ మంత్రి వీఫెంగ్ తైవాన్‌ను చైనా నుంచి విడదీస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
ఒకవేళ ఎవరైన విడదీయడానికి ధైర్యం చేస్తే ఖర్చుతో నిమిత్తం లేకుండా యుద్ధం ప్రారంభించడానికీ చైనా వెనుకాడదని హెచ్చరించారు. అంతేకాదు తైవాన్ స్వాతంత్య్రం కావాలని ప్రకటిస్తే బీజింగ్ తప్పక యుద్ధం ప్రారంభించడానికి వెనుకాడదు అని కూడా తేల్చి చెప్పారు. తైవాన్ చైనాకి సంబంధించినదేనని నొక్కి చెప్పారు. చైనాను నియంత్రించడానికి తైవాన్‌ని ఉపయోగించుకోవాలని చూడొద్దంటూ అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఐతే ఆ సమావేశంలో అమెరికా రక్షణాధికారి ఆస్టిన్ తైవాన్‌ని ఇబ్బంది పెట్టే చర్యలకు చైనా చాలా దూరంగా ఉండాలంటూ ఆ దేశ రక్షణ మంత్రికి గట్టి కౌంటరిచ్చారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన దగ్గరి నుంచి చైనా నుంచి తైవాన్‌కు అదే పరిస్థితి ఎదురవుతుందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. డ్రాగన్ ముప్పును దృష్టిలో పెట్టుకొని.. తైవాన్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుంది. యుద్ధం వస్తే పౌరులు ఎలా స్పందిచాలనే దానిపై మార్గదర్శకాలు జారీ చేస్తోంది.