Rishi Sunak: ప్రపంచ భద్రతకు, శ్రేయస్సుకు చైనా అతిపెద్ద సవాల్ గా ఉందని, అయితే ఆదే సమయంలో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దాని నుంచి పూర్తిగా విడిపోవడానికి ప్రయత్నించకూడదని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. జపాన్ లోని హిరోషిమా వేదికగా జీ-7 సమావేశాలకు ఆయన హజరయ్యారు. ఈ సమావేశాల అనంతరం రిషి సునాక్ ఈ వ్యాక్యలు చేశారు. ప్రస్తుత యుగంలో చైనా ప్రపంచ భద్రతకు అతిపెద్ద సవాల్ అని అన్నారు. చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు బ్రిటన్, ఇతర జీ-7 దేశాలు ఉమ్మడి విధానాన్ని అనుసరిస్తామని సునాక్ అన్నారు. చైనా తన ఆర్థిక బలంతో ఇతర దేశాల సార్వభౌమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సునాక్ తెలిపారు.
Read Also: Somu Veerraju : రూ. 2000 నోటు రద్దు నిర్ణయం మోడీ సాహసోపేత నిర్ణయం
జీ-7 దేశాలైన జపాన్, ఇటలీ, కెనడా, ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, జర్మనీ దేశాల అధినేతలు జపాన్ వేదికగా సమావేశం అయ్యారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, చైనా దుందుడుకు వైఖరి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించారు. ఈ సమావేశాలకు ప్రత్యేక అతిథిగా ప్రధాని నరేంద్రమోడీని జపాన్ ఆహ్వానించింది. జీ-7 సమావేశాల అనంతరం క్వాడ్ దేశాలు అయిన ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, భారత దేశాల నేతలు సమావేశం అయ్యారు. ఇండో-పసిఫిక్ రీజియన్ లో చైనాను అడ్డుకునే వ్యూహాలను చర్చించారు. దక్షిణ చైనా సముద్రంలో వియత్నాం, జపాన్ దేశాలకు చెందిన కొన్ని ద్వీపాలు తమవే అని చైనా మొండికేస్తుంది. ఈ దేశాల పరిధిలోని జలాల్లో కృత్రిమ ద్వీపాలను నిర్మిస్తోంది. ఈ పరిణామాలను అడ్డుకునేందుకు క్వాడ్ దేశాల కూటమి ఏర్పడింది.