Iran-Israel Tensions: ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో మధ్యప్రాచ్యంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీపై ఇటీవల ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసి , ఇరాన్ అగ్రశ్రేణి మిలిటరీ కమాండర్‌తో పాటు ఆరుగురు సైనిక అధికారులను హతమార్చింది. అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. వచ్చే 24 గంటల్లో ఏ క్షణానైనా ఇరాన్, ఇజ్రాయిల్‌పై నేరుగా దాడి చేసే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎలాంటి దాడినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రకటించారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇరాన్, ఇజ్రాయిల్‌కి చెందిన కార్గో షిప్‌పై హర్ముజ్ జలసంధి వద్ద దాడి చేసింది. MSC ఏరీస్ అనే జియోనిస్ట్(ఇజ్రాయిల్)కి చెందిన కంటైనర్ షిప్‌ని స్వాధీనం చేసుకున్నామని, దాన్ని ఇరాన్ ప్రాదేశిక జలాల వైపు మళ్లించామని ఇరాన్ స్టేట్ టీవీ తెలిపింది. ఈ పరిణామాలకు తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇజ్రాయిల్, ఇరాన్‌ని హెచ్చరించింది.
Read Also: Iran: ఇజ్రాయిల్ నౌకను సీజ్ చేసిన ఇరాన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత..
అయితే, ఈ కార్గో నౌకలో ఉన్న మొత్తం 25 మంది సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భారతీయులు ఉన్నారని మాకు తెలుసు. మేము ఇరాన్‌తో భారత్ దౌత్యమార్గాల ద్వారా టచ్‌లో ఉందని భారతీయ పౌరుల భద్రత, సంక్షేమం, ముందస్తు విడుదల కోసం ప్రయత్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఓడ కంపెనీ ఇటాలియన్-స్విస్ గ్రూప్ ఎంఎస్‌సీ దీనిపై స్పందించింది. అందులో 25 మంది సిబ్బంది ఉన్నట్లు తెలిపింది. వారి శ్రేయస్సు కోసం ఓడను సురక్షితంగా తిరిగి వచ్చేలా చూసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ పరిణామాలపై ఇజ్రాయిల్ మండిపడుతోంది. ఇరాన్ ప్రపంచంలోనే అతిపెద్ద టెర్రర్ స్పాన్సర్ అని, దాని నెట్వర్క్ కేవలం ఇజ్రాయిల్, గాజా, లెబనాన్, సిరియా ప్రజలను బెదిరించదని ఇజ్రాయిల్ చెప్పింది. ఇరాన్ పాలకులు ఉక్రెయిన్, వెలుపల యుద్ధాలకు ఆజ్యం పోస్తుందని, ఇరాన్ దురాక్రమణ నుంచి రక్షించుకోవడానికి మేము సంసిద్ధతతో ఉన్నామని ప్రకటించింది. పరిస్థితిని తీవ్రతరం చేయడానికి ఇరాన్ ఇలాంటి మార్గాలను ఎంచుకుందని, దీని పర్యవసానాలు భరించాల్సి ఉంటుందని ఇజ్రాయిల్ సైనిక ప్రతినిధి డేనియల్ హగారి అన్నారు.