Karnataka: కర్ణాటకలో మతపరమైన ఉద్రిక్తత ఏర్పడింది. బెలగావిలో ఒక దళిత హిందూ యువకుడు, ముస్లిం యువతితో కలిసి కూర్చోవడాన్ని తప్పుపడుతూ ముస్లిం పురుషుల బృందం వారిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడిలో 9 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
బాధితుడు సచిన్ లామాని(18), ముస్కాన్ పటేల్(22) ఇద్దరు కలిసి ఉండటాన్ని చూసిన ముస్లింమూక ఇద్దరిపై పైపులు, రాడ్లతో దాడులు చేశారు. దాడికి తర్వాత బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.
ఈ ఘటనపై బాధితుడు సచిన్ మాట్లాడుతూ.. ‘‘హిందువు, ముస్లిం కలిసి ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారని, నేను వారికి ఆమె ముస్లింకాదని, నా సొంత అత్త కుమార్తె అని చెప్పాను. వారు మా ఫోన్లతో పాటు రూ. 7000 లాక్కున్నారు’’ అని చెప్పాడు. సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకువచ్చిన యువనిధి పథకానికి దరఖాస్తు చేసేందుకు ముస్కాన్‌తో కలిసి వెళ్లిన సమయంలో ఈ పరిస్థితి తలెత్తిందని సచిన్ వెల్లడించారు.
బెళగావిలోని కిల్లా సరస్సు సమీపంలో శనివారం మధ్యాహ్నం ఇద్దరు కూర్చుని ఉన్నప్పడు సచిన్, ముస్కాన్‌ల పేర్లను ఆరా తీసి వారిపై దాడి చేసినట్లు ఫిర్యాదు పేర్కొంది. ఇద్దరు వేర్వేరు మతాల వారని తెలుసుకున్న తర్వాత వారిపై నిందితులు దాడి చేశారని, దాడి సమయంలో నిందితులు తాగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇద్దరిని దూషిస్తూ.. దుండగులు సచిన్ మెడకు ఉచ్చు బిగించి చంపేందుకు ప్రయత్నించారు. మరో 13 మంది దాడి చేసిన వారితో చేరి, సచిన్, ముస్కాన్ లను ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి, అక్కడ శనివారం సాయంత్రం వరకు సచిన్‌ని తీవ్రంగా కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.