Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్‌ని సందర్శించడాన్ని మాల్దీవులు తట్టుకోలేకపోతోంది. ప్రధాని లక్ష్యంగా మాల్దీవుల మంత్రి మరియం షియునా చేసిన అవమానకర వ్యాఖ్యలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధానిని ‘‘విదూషకుడు, తోలుబొమ్మ’’ అంటూ ఆమె ఎక్స్‌లో కామెంట్ చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో పోస్టును తొలగించింది. అయితే ప్రధానిపై ఆమె చేసిన వ్యాఖ్యల్ని భారత్, మాల్దీవులు ప్రభుత్వం వద్ద లేవనెత్తింది. భారత హైకమిషనర్ ఈ విషయాన్ని మాలేలోని మహ్మద్ మయిజ్జూ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని సంప్రదించారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై మయిజ్జూ ప్రభుత్వంపై సొంతదేశంలోనే వ్యతిరేకత వ్యక్తమైంది. అక్కడి ప్రతిపక్షం ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక విదేశీ నేతలపై ఇలాంటి వ్యాఖ్యల్ని చేయడాన్ని తప్పుపట్టారు. అంతేకాకుండా భారత్ తమ మిత్రదేశమని, ఈ వివాదానికి అధ్యక్షుడు మయిజ్జూ దూరంగా ఉండాలని సూచించారు.
వివాదం పెద్దది కావడంతో ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యల్ని అక్కడి ప్రభుత్వం తప్పుపడుతూ.. ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. మంత్రి షియునా చేసిన వ్యాఖ్యలకి దూరంగా ఉంటూ.. ఈ వ్యాఖ్యలకి ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పింది. ‘‘విదేశీ నాయకులు, ఉన్నతస్థాయి వ్యక్తులపై సోషల్ మీడియాలో అవమానకరమైన వ్యాఖ్యల గురించి మాల్దీవుల ప్రభుత్వానికి తెలుసు. ఈ అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతమైనవి, మాల్దీవుల ప్రభుత్వానికి అవి ప్రాతినిధ్యం వహించవు’’ అని అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రజాస్వామ్య, బాధ్యతాయుతమైన పద్ధతిలో భావప్రకటన స్వేచ్ఛను ఉపయోగించాలని ప్రభుత్వం విశ్వసిస్తోందని, ఇది ద్వేషం, ప్రతికూలత వ్యాప్తి చెందకుండా మాల్దీవులు, దాని అంతర్జాతీయ భాగస్వాముల మధ్య సన్నిహిత సంబంధాలకు ఆటంకం కలిగించకుండా ఉంటుందని పేర్కొంది. ప్రభుత్వ సంబంధిత అధికారులు ఇలాంటి కించపరిచే వ్యాఖ్యలు చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడదని తెలిపింది.