IT Companies Bumper Offer: కరోనా వైరస్ కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసిన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు శ్రమిస్తున్నాయి. చెప్పిన వెంటనే ఆఫీసులకు వచ్చే వారికి అదనపు సెలవులు, అధిక జీతం ఇచ్చేందుకు సిద్ధపడుతున్నాయి. ఆఫీసుకు వస్తే తాయిలాలు లేదంటే అలవెన్సులు, ఇతర సౌకర్యాల్లో కోత విధించేలా పలు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. కార్యాలయాలకు వచ్చి పని చేసే ఉద్యోగులకు అధిక సెలవులు ఇవ్వడంతో పాటు భారీ మొత్తంలో వేరియబుల్ పే చెల్లించడం, వినోద, విందు కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాయి. దీంతో క్రమంగా ఆఫీసులకొచ్చే సిబ్బంది సంఖ్య 40 శాతానికి చేరిందని సమాచారం.
Read Also: Anasuya: ట్రెండింగ్‌లో ‘ఆంటీ’.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించనున్న ప్రముఖ యాంకర్
మరోవైపు ఐటీ పరిశ్రమలో సిబ్బంది వలసల రేటు 15 నుంచి 20 శాతంగా నమోదైంది. నిపుణులకు డిమాండ్ అధికంగా ఉండటంతో మంచి ప్యాకేజీ ఇచ్చే కంపెనీకి మారడం గత ఏడాదిన్నర కాలంగా అధికమైంది. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు లభిస్తుండటంతో కంపెనీలు నిపుణులను నియమించుకునేందుకు ఎంత ప్యాకేజీలు ఇవ్వడానికైనా వెనుకాడటం లేదు. అటు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థులకు మూడు నుంచి 5 నెలల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని ఐటీ కంపెనీలు కల్పిస్తున్నాయి. కాస్త అనుభవం రాగానే ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నం అయ్యేందుకు ఆఫీసుకు పిలిపిస్తున్నట్లు కంపెనీలు పేర్కొన్నాయి. అటు ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం వల్ల పలు కంపెనీలకు బిల్డింగ్ అద్దె, విద్యుత్, రవాణా, ఇంటర్నెట్ ఖర్చులు, ఇతర వ్యయాలు తగ్గాయి. ఈ మేరకు పలు కంపెనీలు లాభాలను ఆర్జిస్తున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను కొనసాగించేందుకు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తోంది.