Byju’s: ప్రముఖ ఎడ్‌టెక్ సంస్థ బైజూన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో దాదాపుగా 500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ తొలగింపు ప్రక్రియ 15-20 రోజుల క్రితమే ప్రారంభమైందని తెలుస్తోంది. దాదాపుగా 500 మంది ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండనుంది. తాజాగా ఉద్యోగాల కోత సేల్స్ ఫంక్షన్స్, టీచర్లు, ట్యూషన్ సెంటర్లపై ప్రభావం చూపుతోంది. అయితే, అధికారికంగా బైజూన్ నుంచి మాత్రం ఎలాంటి సమాచారం లేదు. కొంతమంది సిబ్బందికి ఫోన్ల ద్వారా తాజా పరిణామాల గురించి తెలియజేశారు.
అక్టోబర్ 2023లో ప్రకటించిన బిజినెస్ రీస్ట్రక్చరింగ్ లో భాగంగా మెరుగైన నగదు ప్రవాహ నిర్వహణ, ఆపరేటింగ్ స్ట్రక్చరింగ్, ఖర్చులను తగ్గించుకునే ప్రక్రియలో చివరి దశలో ఉన్నామని బైజూస్ ప్రతినిధి చెబుతున్నారు. నలుగురు విదేశీ పెట్టుబడిదారులతో కొనసాగుతున్న వ్యాజ్యం కారణంగా కంపెనీ అసాధారణ పరిస్థితిని ఎదుర్కొంటుందని, ఇక్కడ ప్రతీ ఉద్యోగి, ఎకో సిస్టమ్ తీవ్రంగా ఒత్తిడికి గురవుతోందని చెప్పారు.
Read Also: Zomato: జొమాటోకు జీఎస్టీ భారీ షాక్.. నోటీసులో ఏముందంటే..!
వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా దాదాపుగా 4500 మందిపై ప్రభావం చూపుతుందని ఇంతకుముందు బైజూస్ చెప్పింది. ఆ తర్వాత 2023 అక్టోబర్-నవంబర్‌లో 2500-3000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పటి వరకు 3000-3500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని అనుకుంటే, మరో 1000-1500 మందిని తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మార్చి వేతనాల పంపిణీలో జాప్యం ఏర్పడుతుందని ఇటీవల కంపెనీ తన ఉద్యోగులకు చెప్పింది.
బైజూస్ సీఈఓ రవీంద్రన్‌తో సహా సహవ్యవస్థాపకులను తొలగించి, కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ.. పెట్టుబడిదారుల సమూహం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (NCLT) ముందు పిటిషన్ దాఖలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో ఓ వెలుగు వెలిగిన బైజూస్, తర్వాత ఫిజికల్ క్లాసులు ప్రారంభం కావడం, ఆకాష్ కొనుగోలు చేయడంతో కంపెనీ ఆర్థిక ఇబ్బందులకు గురైంది.