8 బిలియన్ డాలర్లు తగ్గిన ఫారెక్స్ నిల్వలు
మన విదేశీ మారక నిల్వలు ఈ నెల 8వ తేదీ నాటికి 8 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఫారెక్స్ రిజర్వ్‌లను పెంచేందుకు ఆర్బీఐ ఈ నెల 6వ తేదీన కొన్ని చర్యలను ప్రకటించింది. అయితే ఆ చర్యల ఫలితాలు కనిపించటానికి కొంచెం టైం పడుతుందని ఆర్థికవేత్తలు తెలిపారు. ప్రస్తుతం విదేశీ మారక నిల్వలు 580.3 బిలియన్ డాలర్లు ఉన్నాయి.
8 పైసలు కోలుకున్న రూపాయి.
ఇటీవలి కాలంలో రికార్డు స్థాయిలో విలువ కోల్పోయిన రూపాయి తాజాగా కాస్త కోలుకుంది. అమెరికా డాలర్‌తో పోల్చితే 8 పైసలు పెరిగింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 79.91 వద్ద కొనసాగుతోంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం పెరగటం రూపాయికి కలిసొచ్చిందని ఫారెక్స్ డీలర్లు పేర్కొన్నారు.
డబ్ల్యూటీఓ నిబంధనలను సడలించాలి
ఆహారధాన్యాల ఎగుమతుల నిబంధనలను సడలించాలని ఇండియా ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)ను కోరింది. తిండిలేక ఇబ్బందిపడుతున్న దేశాలను ఆదుకోవటానికి ఇది ఎంతో అవసరమని పేర్కొంది. నిబంధనలను సడలిస్తే ఇండియాలోని నిల్వల నుంచి ఆహారధాన్యాలను ఆయా దేశాలకు ఎగుమతి చేయటానికి వీలుపడుతుందని తెలిపింది.
యూఏఈకి 16.22 శాతం పెరిగిన ఎగుమతులు
మే-జూన్ మధ్య కాలంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కి ఇండియా నుంచి 16.22 శాతం ఎగుమతులు పెరిగాయి. ఇరు దేశాలు కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) మే ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో మొత్తం ఎగుమతుల విలువ 837.14 డాలర్లకు పెరిగినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
క్రిప్టోలనూ లెక్కలోకి తీసుకోవాలి
క్రిప్టో కరెన్సీల వంటి ఆర్థికేతర ఆస్తులనూ పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. పన్ను ఎగవేత కట్టడికి ఈ చర్య ఉపయోగపడుతుందని చెప్పారు. పరస్పర సమాచార మార్పిడి వ్యవస్థ పరిధిలోకి క్రిప్టోలనూ తీసుకురావాలని ఆమె జీ20 దేశాలకు పిలుపునిచ్చారు.