పుంగనూరులో ఆరేళ్ల చిన్నారి హత్య కేసును పోలీసుల ఛేదించారు. అస్ఫియా హత్య కేసును ఛేదించినట్లు హోంమంత్రి అనిత స్వయంగా ప్రకటించారు. అస్ఫియా ఆచూకీ కోసం 12 ప్రత్యేక పోలీసు బృందాలు గాలించినట్లు హోంమంత్రి తెలిపారు. చిన్నారి హత్యకు గురికావడం బాధాకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగిన కోట్ల రూపాయల స్కాం సంచలనం సృష్టిస్తోంది. బాధితుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే 60 మందికి పైగా ఖాతాదారులు ఆధారాలతో సహా బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని బ్యాంక్ అధికారుల వద్ద బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో విశాఖ స్టీల్‌ప్లాంట్ పోరాట కమిటీ భేటీ కానుంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పోరాట కమిటీ ఉపముఖ్యమంత్రిని కోరనుంది.
పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్యపై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్‌కి పంపాలంటే భయమేస్తోందన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా అంటూ ప్రశ్నించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మాత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి సింహవాహనంపై మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఇదిలా ఉండగా.. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దసరా శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మ ఇవాళ 4వ రోజు శ్రీలలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము నుంచే కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు విచ్చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.