Tirumala: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మాత్సవాల్లో మూడో రోజైన ఆదివారం ఉదయం శ్రీమలయప్పస్వామి సింహవాహనంపై మాడవీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఇదిలా ఉండగా.. రాత్రి సర్వభూపాల వాహనంపై మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రెండో రోజైన శనివారం రాత్రి శ్రీమలయప్పస్వామి హంస వాహనంపై వీణ ధరించి సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. హంస వాహన సేవలో స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తారు. శనివారం ఉదయం చిన్నశేష వాహనంపై మురళీకృష్ణుడి అలంకారంలో స్వామి వారు ఊరేగారు.
Read Also: Sabarimala: వారికి మాత్రమే శబరిమల అయ్యప్ప దర్శనం.. రోజుకు 80వేల మందికే దర్శనం
ఇదిలా ఉండగా.. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి వెలుపల వరకు భక్తులు క్యూలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 75,552 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,885 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.54 కోట్లు వచ్చింది.