అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రమాద ఘటన కేసులో విచారణ కొనసాగుతోంది. మొత్తం 2,400 రికార్డులు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సగం వరకు కాలిపోయిన 700 రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న పెద్దిరెడ్డి అనుచరుడు మాధవ్ రెడ్డి కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద ప్రస్తుతం 13.70 అడుగులకు వరద నీటి మట్టం తగ్గింది. బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి ముగ్గురిని హత్య చేసి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకోవడం తిరుపతి పద్మావతి నగర్‌లో కలకలం రేపుతోంది. అన్నమీద కోపంతో ఓ తమ్ముడు.. వదినతో పాటు, వారి ఇద్దరి కూతుళ్లను కిరాతకంగా నరికి చంపిన ఘటన పద్మావతి వర్సిటీ సమీపంలోని పద్మావతి నగర్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.
నేడు మధ్యాహ్నం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. పోలవరం విషయంలో కీలక చర్చ జరపనున్నారు. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయాఫ్రం వాల్ స్థితిగతులపై కేబినెట్‌లో కీలక సమీక్ష జరగనుంది. ఇటీవల కేంద్ర బడ్జెట్‌లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం చేస్తామని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. నేడు అసెంబ్లీలో గత 5ఏళ్ల పాలనలో రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు శాసనసభ సంతాపం ప్రకటించనుంది.
కేంద్రబడ్జెట్‌లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని విమర్శించారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అంటూ ప్రశ్నించారు.
టీడీపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. బడ్జెట్‌లో ఏపీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టారన్నారు.