TDP MPs on Union Budget: టీడీపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌పై స్పందించారు. బడ్జెట్‌లో ఏపీ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపించారని పేర్కొన్నారు. టీడీపీ ఎంపీ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టారని.. ఎన్నో పెండింగ్ సమస్యలకు పరిష్కారం చూపెట్టారన్నారు. 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు ఊపిరి పీల్చుకునేలా చేశారన్నారు. ఐదేళ్ల జగన్ పాలనలో 20 ఏళ్లు వెనక్కి పోయిందని.. కేంద్రం సాయం అందించకపోతే ఏపీ ఎంతో నష్టపోయేదన్నారు. ఎన్నికల ముందే ప్రజలకు హామీ ఇచ్చామని, కేంద్రంలో మోడీ, ఏపీలో మోడీ వస్తే అభివృద్ధి సాధ్యం అని చెప్పామన్నారు. అమరావతికి 15 వేల కోట్లు కేటాయించారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అమరావతి అభివృద్ధి జరక్కుండా జగన్ అడ్డుకున్నారని ఆరోపించారు. పోలవరం జీవనాడి ప్రాజెక్టు అని.. జగన్ పోలవరాన్ని వెనక్కి తీసుకు పోయారని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం హామీ ఇచ్చిందని ఎంపీ స్పష్టం చేశారు.
Read Also: P. Chidambaram: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మలా చదివింది..
దేశ ప్రజల ఆకాంక్షలను ఈ బడ్జెట్ ద్వారా నెరవేర్చే ప్రయత్నం జరిగిందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ దిగుబడి పెంచడంపై దృష్టి కేంద్రీకరించారని చెప్పారు. సంక్షేమం కావాలి తప్పదు.. దాంతో పాటు ఉపాధి కల్పన కూడా కావాలన్నారు. ఉపాధి కల్పన కోసం బడ్జెట్ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత ఐదేళ్లలో బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ గురించి ఇంత ఎక్కువగా మాట్లాడలేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనల ఫలితంగా ఇది సాధ్యపడిందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడం సాధ్యపడిందని.. పోలవరం ప్రాజెక్టు పెరిగిన అంచనా వ్యయం ఇవ్వమని అడుగుతున్నామని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వెల్లడించారు. ఏపీకి పరిశ్రమలు రావాలని చెప్పగా.. కొప్పర్తి, ఓర్వకల్లు నోడ్ ఇచ్చారని.. ఇది చాలా ఉపయోగకరమన్నారు. పూర్వోదయ స్కీమ్ ద్వారా తూర్పు భారత రాష్ట్రాల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా తోడ్పాటు అందనుందని ఎంపీ వెల్లడించారు. ఇందులో అన్ని రంగాల ప్రాజెక్టులు ఉంటాయని ఆయన చెప్పారు.
బడ్జెట్ ద్వారా ఏపీ ప్రజలకు కొంత ఉపశమనం దొరికిందన్నారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న దిశగా ఈ బడ్జెట్ ఒక మొదటి అడుగు అని పేర్కొన్నారు. ఇందుకు ప్రధాన మంత్రికి, ఆర్థిక మంత్రికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉందని.. హైదరాబాద్ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తోందన్నారు. అలాంటి నగరం ఏపీకి లేదని.. అమరావతిని గత ప్రభుత్వం ఆపేసిందన్నారు. అమరావతి వల్ల రాష్ట్రానికే కాదు, దేశానికి కూడా లాభం అని సీఎం చెప్పారన్నారు. వెనుకబాటుతనం తక్కువగా ఉన్న రాష్ట్రాలు నరేగా నిధులు ఎక్కువ తీసుకెళ్లారని.. ఏపీ గత ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు విమర్శలు గుప్పించారు.