ఏపీ అసెంబ్లీలో జంగారెడ్డిగూడెంలో వరుస మరణాలపై రగడ జరుగుతోంది. ఈ అంశంపై సభలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. టీడీపీ ప్రభుత్వం ఇంటింటికి నీళ్లు ఇచ్చిందో లేదో కానీ లిక్కర్ మాత్రం ఇచ్చిందని వైసీపీ ఎమ్మెల్యే రోజా అసెంబ్లీలో ఎద్దేవా చేశారు. ATM (ఎనీ టైమ్ మందు) అనేలా చంద్రబాబు పాలన సాగిందని ఆరోపించారు.
టీడీపీ హయాంలో ఆరు వేల స్కూళ్లను మూసేసి 40 వేల బెల్ట్ షాపులు తెరిచారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. గుడి, బడి అనే తేడా లేకుండా ప్రతి సందులో మద్యం దుకాణాలు తెరిచారని మండిపడ్డారు. మద్యం కమీషన్లు కోసం రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించారని.. ప్రభుత్వం నుంచి దిగిపోయే వరకు బార్లకు లైసెన్సులు ఇచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు. మద్యం సిండికేట్లతో కుమ్మక్కై ఆడవారి పసుపు, కుంకుమతో చెలగాటమాడారని.. అందుకే ప్రతి మహిళ గుర్తు పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని ఛీ కొట్టి తరిమికొట్టిందని ఆరోపించారు. కాగా సభలో ప్రశ్నోత్తరాలు జరగకుండా టీడీపీ అడ్డుకుంటోందని.. వాళ్లే ప్రశ్నలు వేస్తూ.. వాళ్లే సభను అడ్డుకుంటున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు.