Vishnu Vardhan Reddy Fires On Dharmana Comments And Chandrababu Naidu: అమరావతిని రాజధాని చేస్తే, ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరుతానంటూ ఇటీవల ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ధర్మాన మాట్లాడారని, ఆయన వ్యాఖ్యల్ని బట్టి చూస్తుంటే 2024 నాటికి ఏపీని రెండు లేదా మడు ముక్కలుగా చేసేటట్టు ఉన్నారని మండిపడ్డారు. ఇవి కేవలం ధర్మాన వ్యక్తిగత వ్యాఖ్యలేనా? లేక వైసీపీ లేదా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనా? అని ప్రశ్నించారు. ఇది కేవలం ధర్మాన అభిప్రాయం మాత్రమే అయితే.. ఆయన్ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తారా? అని అడిగారు.
Nagababu: వైసీపీ, ఆర్జీవీపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన నాగబాబు.. మీ తాత, అయ్యా ఇచ్చారా?
ధర్మాన ప్రత్యేక రాష్ట్రం అడగడం వెనుక ఉద్దేశ్యం ఏంటన్న విష్ణువర్ధన్.. రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం పెట్టి, కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారా? అని నిలదీశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ధర్మాన ఏం చేశారో చెప్పాలని, ఉద్ధానానికి మీరిచ్చిన హామీ నెరవేరిందా? అని ధర్మానని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అజెండీ ఏమిటో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ చెప్పాలని కోరారు. 2024లో జగన్, ధర్మాన అజెండాలు ఒకటేనా అని సందేహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్ర ద్రోహుల్లా తయారయ్యారని, ప్రజల మధ్య తగాదాలు పెట్టి చలికాచుకోవాలని అనుకుంటున్నారని విమర్శించారు. ఏపీలో దోచుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయడం మినహాయిస్తే.. మరేం జరగడం లేదని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే.. వైసీపీ పోయి, బీజేపీ రావాలని పిలుపునిచ్చారు.
ఇదే సమయంలో చంద్రబాబుపై కూడా విష్ణువర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు అవసరమైనప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం గుర్తొస్తుందని అన్నారు. చంద్రబాబు మాయలో పడేందుకు బీజేపీ సిద్దంగా లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోడీని అవమానించారని, అమిత్‌షాపై రాళ్ల దాడి కూడా చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయాక ప్రధాని మోడీ చుట్టూ చంద్రబాబు తిరుగుతున్నారన్నారు. చంద్రబాబు మేకవన్నే పులి అని.. బీజేపీతో పొత్తు ఉంటుందని ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఓ జాతీయ పార్టీ అని, దాన్ని తక్కువ అంచనా వేయవద్దని హెచ్చరించారు.