GVMC Mayor: గ్రేటర్ విశాఖ మేయర్ పీఠం కోసం రాజకీయ పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. నోటీసులు ఇచ్చిన కూటమి సంఖ్యాబలం సాధించడం కోసం చేస్తున్న ప్రయత్నాలకు వైసీపీ గండికొట్టే ప్రయత్నాలు విస్తృతం చేసింది. వలసల తర్వాత మిగిలిన 33మంది కార్పొరేటర్లు ను బెంగుళూరులో బేస్ క్యాంప్‌కు తరలించింది. అక్కడ నుంచి వాళ్లందరినీ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోని దేవాలయాలు, పర్యటక కేంద్రాల చుట్టూ తిప్పే విధంగా టూర్ డిజైన్ చేసి విశాఖ దాటిచేయడంలో సక్సెస్ అయ్యింది. దీంతో వైసీపీ కార్పొరేటర్లతో లోపాయికారీ ఒప్పందంతో మేయర్ కైవసం చేసుకోవాలని చూసిన కూటమికి ప్రతికూల పరిస్థితి తలెత్తింది. పైగా ఇటీవల అభివృద్ధి కోసం అంటూ ఫ్యాన్ పార్టీని వీడి వచ్చిన కార్పొరేటర్లు పైన పూర్తి స్థాయిలో నమ్మకం వుంచలేని సందిగ్ధత నెలకొంది. దీంతో ఆరుగురు కార్పొరేటర్లు ను ఓ హోటల్ లో పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
Read Also: Trump: ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఎన్నికల ప్రక్రియపై భారీ మార్పులు
అవిశ్వాసం నల్లేరు మీద నడక అనుకుంటే మారుతున్న పరిస్థితులు రాజకీయ సంక్లిష్టకు కారణం కావొచ్చు అనే నెగెటివ్ సంకేతాలు జనసేన, టీడీపీ అధి నాయకత్వానికి చేరాయి. దీంతో ప్రత్యేకంగా పరిశీలకులను నియమించి బాధ్యతలు అప్పగించింది. మారుతున్న పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలను కుంటే క్యాంప్ ఏర్పాటు చేయడం అనివార్యమనీ భావిస్తోంది కూటమి నాయకత్వం. ఈనెల 29న గ్రేటర్ బడ్జెట్ సమావేశం వుంది. ప్రస్తుతం మేయర్ హరి వెంకట కుమారి., ఇద్దరు డిప్యూటీ మేయర్ లు క్యాంపు లో వున్నారు. దీంతో బడ్జెట్ సమావేశాలకు మేయర్ హాజరు అవుతారా..? లేదా అనేది ఆసక్తికరం. వైసీపీ నుంచి వున్న సమాచారం ప్రకారం బడ్జెట్ కీలకం గనుక ఆరోజు మేయర్ క్యాంప్ నుంచి వచ్చి సమావేశం అనంతరం తిరిగి వెళ్లిపోతారు.
Read Also: Kadapa Zilla Parishad Chairman Election: హైకోర్టుకు చేరిన కడప జిల్లా పరిషత్ ఎన్నిక పంచాయితీ..
వైసీపీ యాక్షన్ నేపథ్యంలో కూటమి స్ట్రాటజీ మార్చింది. దాదాపు 62మంది కార్పొరేటర్లు బలం వుందని చెబుతుండగా వాళ్లందరినీ క్యాంప్ కు మళ్లించేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ పరిణామాలను వైసీపీ నిశితంగా పరిశీలిస్తోంది. బొత్స రంగ ప్రవేశంతో లెక్కలు మారుతున్నాయి అనే అభిప్రాయం వుంది. అందుకు తగ్గట్టుగానే బొత్స తన దైన మార్క్ పాలిటిక్స్ తెరపైకి తెచ్చారు. కార్పొరేటర్లుతో నేరుగా మాట్లాడటంతో పాటు అసంతృప్తి కారణంగా కూటమి వైపు మళ్లిన వాళ్లను వెనక్కి రప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఇప్పుడు నడుస్తున్నది ట్రైలర్ మాత్రమేనని… సినిమా ముందు వుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తంగా గ్రేటర్ మేయర్ అవిశ్వాసం అటు కూటమికి, ఇటు వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట..