Vijayawada Floods: ఓవైపు సమీక్షలు.. మరోవైపు క్షేత్ర స్థాయి పర్యటనలు.. మొత్తంగా బెజవాడలో వరదలపైనే ఫోకస్ పెట్టారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాత్రి గంటన్నర సేపు సింగ్ నగర్ లో పర్యటించిన సీఎం చంద్రబాబు. బోట్ల ద్వారా తరలించిన, స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో మాట్లాడారు.. వారి ఆవేదన, బాధలను, రెండు రోజులుగా పడుతున్న కష్టాలను సీఎంకు వివరించారు బాధితులు. ఊహించని ఉత్పాతం వల్ల పడిన ఇబ్బందులను సీఎం చంద్రబాబుకు వివరించారు వరద బాధితులు. ఇప్పటికీ బంధువులు, ఇరుగు పొరుగు వారు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారని తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేశారు..
Read Also: AP Floods : ఏపీ వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు వైజయంతీ మూవీస్ భారీ విరాళం
ఇవాళ ఉదయం నుంచి నీళ్లు, ఆహారం అందిందని, ఎన్డీఆర్ఎఫ్ బోట్ల ద్వారా బయటకు రాగలిగామని సీఎం చంద్రబాబు తెలిపారు బాధితులు.. చుట్టుముట్టిన వరద నీటితో తాము ప్రాణాలతో బయటకొస్తామనుకోలేదని రోధిస్తూ.. సీఎంకు వివరిస్తూ కన్నీరు మున్నీరయ్యారు పలువురు మహిళలు. వరద ప్రాంతాల నుంచి బటయకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులను అంబులెన్స్ లో తరలించేందుకు ఏర్పాట్లు చేశారు ముఖ్యమంత్రి. రెండు రోజులుగా నిరంతరం శ్రమిస్తూ ప్రతి అవకాశాన్ని వినియోగించుకుని వరద సహాయక చర్యలు చేపట్టామని బాధితులకు వివరించారు సీఎం. వందల మంది వరద బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.. పసిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు వరద నీటిలో చిక్కుకుని పడిన ఇబ్బందులు తనను ఎంతో ఆవేదనకు గురి చేశాయన్నారు.. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా బాధితులకు హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.