నేషనల్ హెల్త్ మిషన్ విభాగం ఉన్నతాధికారులతో మంత్రి విడదల రజనీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. నాణ్యమైన వైద్యం జగనన్న లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఉన్నత ఆశయంతో పని చేస్తోందని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ లక్ష్యాలు పూర్తి కావాలని, అన్ని విభాగాల్లోనూ ఏపీనే ముందుండాలని ఆమె అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యలు ఉండటానికి వీల్లేదని, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వీడేలా చూడాలన్నారు.
వైద్య సేవల విషయంలో ప్రజలు వంద శాతం సంతృప్తి చెందాలన్నదే లక్ష్యమని, గ్రామస్థాయి నుంచి మెడికల్ కళాశాలల వరకు ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణం చేయాలన్నారు. ఆధునికీకరణ, వసతుల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ. 16 వేల కోట్లు ఖర్చు చేస్తుందని, వైద్యారోగ్య రంగంలో 40 వేలకు పైగా నియామకాలు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఏమైనా ఇబ్బంది వస్తే సదురు ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని, పీహెచ్‌సీల్లో కాన్పులు జరిగేలా చూడాలన్నారు.