టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. పాలమండలిలో చర్చించిన అంశాలు.. తీసుకున్న నిర్ణయాలను ఆ తర్వాత వివరించారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. సెప్టెంబర్ లోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామన్న ఆయన.. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగించనున్నట్టు స్పష్టం చేశారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ.. ఏపీలో 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.. ఇక, తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్రకటించిన ఆయన.. ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని తెలిపారు.
ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో 500 ఆలయాలను ఏడాదిలోగా నిర్మించాలని పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. ధర్మప్రచారంలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలను నిర్మిస్తున్నామన్న ఆయన.. జమ్మూలో 62 ఎకరాల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నామని, 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామన్నారు.. ఇక, త్వరలోనే ముంబై, వారణాసిలో కూడా టీటీడీ ఆలయాల నిర్మాణం చేపడతామన్న ఆయన.. గుడికో గోమాత కార్యక్రమం ద్వారా దేశ వ్యాప్తంగా 100 ఆలయాలకు గోవులను అందించామని వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులను ఆలయాల నిర్మాణానికి వెచ్చిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.