వర్షం కారణంగా రద్దైన ఐదో T20 మ్యాచ్.. సిరీస్ భారత్ కైవసం
భారత్- ఆస్ట్రేలియాల మధ్య 5T20 సిరీస్ జరిగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నేడు T20 సిరీస్‌లోని ఐదవ, చివరి మ్యాచ్ (నవంబర్ 8) బ్రిస్బేన్‌లోని గబ్బాలో జరిగింది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. భారత్ ఆట ప్రారంభించిన కాసేపటికే వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా మ్యాచ్ డ్రా అయింది. భారీ వర్షం, మెరుపులతో ఆటకు అంతరాయం కలిగే ముందు భారతదేశం వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. మ్యాచ్ రద్దు కావడంతో, భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది.
సీఎం చంద్రబాబు చిట్‌చాట్.. మంత్రి లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్‌చాట్‌లో పలు కీలక అంశాలపై మాట్లాడారు. పార్టీ వ్యవస్థ బలోపేతం, పెట్టుబడుల సాధన, రెవెన్యూ సమస్యల పరిష్కారం, సాంకేతిక పురోగతి వంటి అంశాలపై వివరించారు. ఈ నెలాఖరులోగా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలు పూర్తి చేస్తాం.. డిసెంబర్ నుండి పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాం అని పేర్కొన్నారు.. అలాగే, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ నియామకాలపై కసరత్తు కొనసాగుతున్నదని చెప్పారు చంద్రబాబు.. ఇక, క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైంది. ఇక షిప్‌మెంట్ మాత్రమే మిగిలింది. నిర్ణయించిన సమయానికి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు సీఎం చంద్రబాబు.. మరోవైపు, పెట్టుబడుల సాధనలో మంత్రి లోకేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన నిరంతర కృషి వల్ల రాష్ట్రానికి పాజిటివ్ సిగ్నల్ వస్తోందని ప్రశంసలు కురిపించారు.. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నాం. రెవెన్యూ వ్యవస్థలోని పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టమయ్యాయి అని ఆవేదన వ్యక్తం చేశారు.. 22ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.
ఓట్ల చోరీపై గాంధీలాంటి పోరాటం చేస్తున్నాం.. బీహార్ ర్యాలీలో ప్రియాంకాగాంధీ వ్యాఖ్య
ప్రజల హక్కుల కోసం మహాత్మాగాంధీలాంటి పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కతిహార్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడారు. ‘‘ప్రస్తుతం మహాత్మాగాంధీ పోరాడిన హక్కులు ప్రమాదంలో ఉన్నాయి. అత్యంత ముఖ్యమైన హక్కుల్లో ఓటు హక్కు ఒకటి. ప్రస్తుతం దేశంలో ఓట్ల దొంగతనం జరుగుతోంది. ఓట్ల దొంగతనం కోసం పౌరుల హక్కులను కాలరాస్తున్నారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచేలా బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, మహాఘట్‌బంధన్ పోరాడుతున్న పోరాటం.. అప్పట్లో మహాత్మాగాంధీ పోరాడిన యుద్ధం లాంటిదే. నేటికీ మీ హక్కుల కోసం, సత్యం కోసం, ఒక సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం.. అది నరేంద్ర మోడీ సామ్రాజ్యం. ప్రజలను అణచివేస్తూ దేశాన్ని నడుపుతున్నారు.’’ అని ప్రియాంకాగాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్ట్.. టెన్షన్, టెన్షన్..!
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో, పలాసలో జీడి వ్యాపారిని దుండగులు కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో శిష్టు గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం వెళ్లేందుకు సిద్ధమైన అప్పలరాజును పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. అయితే, పోలీసులు మాత్రం.. ఓ కేసు విషయమై విచారణ కోసం వచ్చాం అని తెలిపారు. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.. సంబంధం లేని కేసుల్లోనూ వైసీపీ నేతలను, కార్యకర్తలను అరెస్ట్ చేసి వేధిస్తున్నారని ఆరోపిస్తున్న విషయం విదితమే..
జమ్మూ కశ్మీర్‌లో షాకింగ్.. డాక్టర్ లాకర్‌లో AK-47 రైఫిల్..
జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంత్‌నాగ్‌కు చెందిన ప్రభుత్వ మాజీ వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ లాకర్ లో AK-47 రైఫిల్ లభ్యమైంది. పోలీసులు ఈ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత్‌నాగ్‌లోని జల్గుండ్ నివాసి ఆదిల్ 2024 అక్టోబర్ 24 వరకు GMC అనంత్‌నాగ్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో FIR నంబర్ 162/2025 కింద భారత శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు, దర్యాప్తు సంస్థలు ఈ అంశంపై తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నాయి.
పోలీసులు రౌడీలు, గూండాల్లా వ్యవహరిస్తున్నారు
పల్నాడు జిల్లాలో మాజీ మంత్రి విడదల రజిని కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండు రోజులుగా తనను, తన అనుచరులను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పూర్తిగా అన్యాయమని, ఇది చట్టవ్యవస్థను అవమానించే పని అని ఆమె మండిపడ్డారు. చట్టానికి, వ్యవస్థలకు తమకు సంపూర్ణ గౌరవం ఉన్నప్పటికీ, పోలీసుల ప్రవర్తన మాత్రం రౌడీలు, గూండాలను తలపిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై నమోదవుతున్న కేసుల నేపథ్యాన్ని వివరించిన రజిని, శ్రీ గణేష్ చౌదరి పేరుతో జరుగుతున్న ఫిర్యాదులు పూర్తిగా రాజకీయ నాటకమని అన్నారు. గణేష్ చౌదరి గత ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ప్రచారంలో పాల్గొన్నాడని, ఈ విషయాన్ని ఫిర్యాదు చేసినవాళ్లే ముందే పేర్కొన్నారని ఆమె చెప్పారు. ఈ ఏడాది మార్చిలో దర్శిలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కూడా గణేష్ టీడీపీ అనుచరుడని స్పష్టమైన పత్రాలలో ఉందని రజిని వెల్లడించారు. పదేళ్ల క్రితం తీసుకున్నట్లు చెప్పిన 35 లక్షల రూపాయల వ్యవహారాన్ని ఇప్పుడు తనపై తప్పుడు కేసులుగా మలచడానికి ప్రయత్నించడం ఎంతో విచారకరమని ఆమె అన్నారు.
48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. నోటీసులకు ఆదేశం
పెన్షన్లు, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న 48 మంది ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్‌గా స్పందించారు. ప్రజలకు నేరుగా చేరుకునే ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొనకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, సంబంధిత ఎమ్మెల్యేలకు వెంటనే నోటీసులు ఇవ్వాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. ప్రజలకు చేరువవుతూ, సంక్షేమ పథకాల అమలులో ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొనడం తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు. నిర్వహణా వ్యవస్థ బలోపేతం కావాలంటే ప్రజాప్రతినిధులే ముందుండాలని, లేకపోతే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటుందని చంద్రబాబు పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో హాజరు కాని ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయబడనున్నాయి.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరగని స్థాయిలో రోడ్ల నిర్మాణం
తెలంగాణలో మౌలిక వసతుల రంగంలో ఎన్నడూ లేని భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో వివిధ రహదారి ప్రాజెక్టులకు మొత్తం రూ.60,799 కోట్లు మంజూరు కావడం తెలంగాణ చరిత్రలోనే అతి పెద్ద రికార్డని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని బహుళజాతి కంపెనీలు, పెట్టుబడిదారుల ప్రధాన కేంద్రంగా మార్చే దిశగా రహదారి నిర్మాణాలు కీలకంగా నిలుస్తాయని కోమటిరెడ్డి చెప్పారు. లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు ఆకర్షితమవుతాయని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయని తెలిపారు.
అభివృద్ధికి కొత్త దిక్సూచి.. కుప్పంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన
కుప్పం ప్రాంతం పరిశ్రమల హబ్‌గా మారే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక అడుగు వేశారు. వర్చువల్‌గా ఏకకాలంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసి కుప్పం అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేశారు. హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E-Royce EV, ALEAP మహిళా పార్కులు.. ఈ సంస్థల ద్వారా మొత్తం రూ. 2,203 కోట్ల పెట్టుబడులు కుప్పంలోకి రానున్నాయి. ఈ పరిశ్రమల కోసం ప్రభుత్వం 241 ఎకరాల భూమిని కేటాయించింది. శంకుస్థాపన అనంతరం సీఎం చంద్రబాబు కుప్పం స్థానిక రైతులు, పాడి రైతులు, మహిళలు, యువతతో ముఖాముఖి జరిపారు. అభివృద్ధి పట్ల ప్రజలు వ్యక్తం చేసిన ఆనందం, కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హంద్రీ-నీవా కాల్వ ద్వారా నీటిసౌకర్యం అందడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కుప్పంకు ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీలు, పాలు కొనుగోలు చేసే సంస్థలు రావడం వల్ల తమ పంటలు, పాల ఉత్పత్తులను ఇక్కడి పరిశ్రమలకే నేరుగా విక్రయించే అవకాశం వస్తుందని రైతులు తెలిపారు. పరిశ్రమలు ఇంత పెద్ద సంఖ్యలో కుప్పానికి వస్తాయని కలలో కూడా అనుకోలేదని మహిళా పాడి రైతులు హర్షం వ్యక్తంచేశారు.